వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 26వ వారం
కేరళ భారత దేశంలో నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రము. క్రీ.పూ.10 వ శతాబ్దంలో ద్రావిడ భాషలు మాట్లాడే వారు ఇక్కడ స్థిరపడ్డారు. కేరళ ఉత్తర ప్రాంతం మౌర్య సామ్రాజ్యం లో భాగంగా ఉండేది. తరువాతి కాలంలో చేర సామ్రాజ్యంలోను, భూస్వామ్య నంబూదిరిల పాలనలోను ఉంటూ వచ్చింది. విదేశాలతో ఏర్పరచుకుంటున్న సంబంధాలు చివరకు స్థానికులకు, ఆక్రమణదారులకు మధ్య ఘర్షణలకు దారితీసాయి. 14 వ శతాబ్దపు తొలినాళ్ళకు, భాష పరంగా కేరళ ప్రత్యేకతను సంతరించుకుంది. ఆధారాలు లభించిన మొదటి సామ్రాజ్యం - చేర వంశీకులు - వంచి రాజధానిగా కేరళను పాలించారు. పల్లవుల తో కలిసి వారు చోళ, పాండ్య రాజులతో యుద్ధాలు చేసారు. 8- 14 శతాబ్దాల మధ్యకాలంలో చేరరాజుల పాలనా సమయంలో మళయాళం భాష అభివృద్ధి చెందింది. ఆదే సమయంలో కేరళీయులు తమిళ ప్రజలలో భాగంగా కాక ఒక ప్రత్యేకమైన జాతిగా గుర్తింపు పొందినారు. లిఖితంగా కేరళ గురించిన ప్రస్తావన సంస్కృత ఇతిహాసం ఐతరేయారణ్యకంలో మొదటిగా లభిస్తున్నది. తరువాత కాత్యాయనుడు, పతంజలి, పెద్దప్లినీల వ్రాతలలోనూ, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంధంలోనూ కేరళ ప్రస్తావనలున్నాయి.
1947లో భారతదేశం స్వతంత్రమైనాక 1949 జూలై 1న తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానాలను కలిపి తిరువాన్కూర్-కొచ్చిన్ ఏర్పరచారు. 1950 జనవరి 1న దీనిని ఒక రాష్ట్రంగా గుర్తించారు. దీనికి ముందే 1947లో మద్రాసు ప్రెసిడెన్సీని మద్రాసు రాష్ట్రం చేశారు. 1956 నవంబరు 1న, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేరళ రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీనుండి మలబార్‌ప్రాంతాన్ని (4 తాలూకాలు మినహా) వేరుచేసి తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రంలో కలిపారు. 1957లో క్రొత్త అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇ.ఎమ్.ఎస్.నంబూద్రిపాద్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం అనేది ప్రపంచంలోనే ఇది మొదటిది.
మూడో ప్రపంచ దేశాల్లోనే అత్యధిక అక్షరాస్యత ఉన్న, అత్యంత ఆరోగ్యకరమైన ప్రాంతంగా కేరళ నిలిచింది. కేరళ జంతు సంపదలో వైవిధ్యం, స్థానికత్వం గమనించదగిన విషయాలు. తీవ్రమైన పర్యావరణ వినాశనం (అడవల నరికివేత, చరియలు విరగడం, ఉప్పుపట్టడం, ఖనిజసంపద త్రవ్వకం వంటివి) వల్ల కేరళలోని జంతు సంపద మనుగడకు ప్రమాదం వాటిల్లుతున్నది. ....పూర్తివ్యాసం: పాతవి