వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 36వ వారం

భారతీయ రైల్వేలు, భారతదేశపు ఒక ప్రభుత్వరంగ సంస్థ. ఇది రైల్వే మంత్రిత్వ శాఖ కింద పని చేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. ఇది ప్రతి రోజూ ఒక కోటీ అరవై లక్షల ప్రయాణీకులను గమ్యం చేరుస్తూండడమే కాక మరో పది లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తోంది. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను (సుమారు పదహారు లక్షలు) కలిగి వున్న సంస్థగా రికార్డుని నెలకొల్పింది. రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి వున్నాయి. ఈ మార్గాల మొత్తం నిడివి సుమారుగా 63,140 కి.మీ (39,233 మైళ్ళు) ఉన్నది. సం.2002 నాటికి రైల్వేల వద్ద 2,16,717 వాగన్లు, 39,263 కోచ్ లు, 7,739 ఇంజిన్లు ఉన్నాయి. భారత రైల్వే ప్రతి రోజూ 14,444 రైళ్ళను నడుపుతూండగా అందులో 8,702 పాసెంజర్ రైళ్ళు.


భారత దేశంలో 1851 ఏప్రిల్ 16న మొదటిసారి రైలు పట్టాలకెక్కింది. రూర్కీలో కట్టుబడి సామాగ్రిని మోసేందుకు దాన్ని వాడారు. కొన్నేళ్ళ తరువాత, 1853 ఏప్రిల్ 16బాంబే లోని బోరి నందర్, ఠాణాల మధ్య -34 కి.మీ.దూరం - మొట్టమొదటి ప్రయాణీకుల రైలును నడిపారు. సం.1947 (స్వాతంత్ర్యం వచ్చే) నాటికి దేశంలో మొత్తం 42 రైల్వే సంస్థలు ఉండేవి. సం.1951లో ఈ సంస్థలన్నింటినీ విలీనం చేయడంతో భారతీయ రైల్వే ప్రపంచంలో అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు మరియు నగరాలలో దగ్గరి ప్రయాణాలకు అవసరమైన రైళ్ళను నడుపుతోంది.


మొత్తం రైలు మార్గము సుమారు 108,706 కి.మీ.(67,547 మైళ్ళు). ఈ మార్గాలను వేగం అధారముగా (75 కి.మీ/గం నుండి 160కి.మీ/గం లేదా 47 మైళ్ళు/గం నుండి 99 మైళ్ళు/గం) విభజించారు. భారతీయ రైలు మార్గాన్ని బ్రాడ్ గేజ్ (స్టాండర్డ్ గేజ్ కంటే వెడల్పైనది – 4  అడుగులు 8½  అంగుళాలు (1,435 మిల్లీ మీటర్లు)); మీటర్ గేజ్; మరియు నారో గేజ్ (స్టాండర్డ్ గేజ్ కంటే తక్కువ). భారత దేశములో అత్యధిక రైలు మార్గం బ్రాడ్ గేజ్. సుమారు 86,526 కీ.మీ (53,765 మైళ్ళు)ల బ్రాడ్ గేజ్ రైలు మార్గం కలదు. రద్దీ తక్కువ ఉన్న ప్రాంతాలకు మీటర్ గేజ్ (1,000 మీ.మీ. (3.28 ft) రైలు మార్గాన్ని నిర్మించారు. ప్రస్తుతం అన్ని మార్గాలను బ్రాడ్ గేజ్ గా మార్చే పనులు జరుగుతున్నాయి. కొండ ప్రాంతాలలో ఉన్న రైలు మార్గాలను నారో గేజ్ మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గాలను బ్రాడ్ గేజ్ గా మార్చడం చాలా కష్టం. మొత్తం నారో గేజ్ రైలు మార్గం 3,651 కీ.మీ (2,269 మైళ్ళు). ఇంకా....పూర్తివ్యాసం: పాతవి