వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 07వ వారం
ప్రదక్షిణము అనే దానికి అర్ధం తిరగడం. హిందువులు దేవాలయంలోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. దైవ ప్రదక్షిణములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట మరియు దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు. భగవదుపచారాల్లో ప్రదక్షిణ నమస్కారం చివరిది, పరిపూర్ణమైనది. ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రాలు సూచిస్తాయి.
ఆలయాల్లో చేసే ప్రదక్షిణల్లో చాలా రకాలున్నాయి. మామూలుగా ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి తిరిగి చివరకు బలిపీఠం (ధ్వజస్తంభం) వద్దకు చేరుకుని దైవానికి నమస్కరించడం ఒక ప్రదక్షిణ క్రమం. చండీశ్వరుడున్న శివాలయం లో ప్రదక్షిణ విధానం మరొక పద్ధతిలో ఉంటుంది. దానికి చండీ ప్రదక్షిణం అని పేరు. ఇంట్లో పూజల సందర్భంలో ఆత్మ ప్రదక్షిణ చేయాలి. గుడులలో ఆత్మ ప్రదక్షిణ చేయరాదు.
ఆలయంలో ఉన్న దైవం విశ్వశక్తి కేంద్రబిందువునకు ప్రతీక. ఆయన చుట్టూ ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతం.
ప్రపంచంలో జరిగే పరిణామాలే ప్రదక్షిణలు. జీవితం అంటే ఒక చుట్టు (ఆవృతం).
జననం నుంచి మరణం వరకు ఈ విశ్వంలో మన జీవితమే ఒక ప్రదక్షిణ. ఇలా ఎన్నో
జన్మల్లో సంపాదించుకున్న కర్మల ఫలితాన్నే ఈ జన్మలో అనుభవిస్తాం. ప్రదక్షిణ
పేరుతో పరమాత్ముని చుట్టూ తిరగడం వలన జన్మల చుట్లలో చేసిన కర్మల
దుష్ఫలితాలను తొలగిమ్చుకోగలం. అంతే కాదు. అత్యధిక ప్రదక్షిణలు చేయడం వలన
రానున్న జన్మల చుట్లను కూడా అధిగమించవచ్చు. కర్మక్షయమే ప్రదక్షిణలో
పరమార్థం. మన మనోవాక్కాయ కర్మలు పరమేశ్వరుని చుట్టూ పరిభ్రమించాలన్నదే
ప్రదక్షిణ లోని ప్రధానోద్దేశ్యం.
దైవ ప్రదక్షిణము వలెనే అశ్వత్థ ప్రదక్షిణము, భూప్రదక్షిణము, కులశైల ప్రదక్షిణములు ఒక దాని కంటె ఒకటి దశోత్తరతమమైన ఫలితాన్నిస్తాయి. అలాగే తండ్రికి, గురువుకు, తల్లికి చేసిన ప్రదక్షిణలు ఒకదాని కంటె ఒకటి పది
రెట్లు ఫలాన్నిస్తాయి. ఉదయము మరియు సాయంకాలము వేళల్లో సూర్య ప్రదక్షిణము
సర్వసిద్ధిప్రదమని చెప్పబడినది.
ఇంకా....పూర్తివ్యాసం పాతవి