వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 52వ వారం

సుమో యోధులు జపాన్ కు చెందిన భారీ శరీరం కలిగిన మల్ల యోధులు.వీరిని జపనీస్ భాషలో రిషికీలు అని పిలుస్తారు. ఆ దేశం లో వీరికున్న ప్రజాధరణ సినిమా హీరోలకు కూడా ఉడదు. అందుకే అక్కడ ఈ క్రేజ్ ఇంకా కొన సాగుతోంది. తకమిక జుచి, తకమిక నత ఇద్దరూ దేవతలే. జపాన్ ద్వీపాలు ఎవరి వల్ల పుట్టాయో తేల్చుకొనేందుకు హోరాహోరి తలపడ్డారు. అలా పుట్టుకొచ్చిందే ఈ సుమో. ఈ క్రీడ పుట్టుక గురించి జపనీయులు చెప్పుకొనే పురాణ కథనమిది. క్రమంగా ఇదో సంప్రదాయం గామారింది. పూర్వకాలంలో పంటలు బాగా పండాలని ఈ పోటీని నిర్వహించేవారు. వేడుకల వేళ సుమో వీరులు తలపడేవారు. సంగీత నృత్య కార్యక్రమాలతో కలిపి ఈ పోటీలు కొనసాగేవి. క్రీ.శ. 8 వ శతాబ్దం నుండి ఈ క్రీడ వాడుకలో ఉంది. 17వ శతాబ్దం నాటికి పూర్తి వినోద క్రీడగా ఆరంభమై జాతీయ క్రీడగా ఎదిగింది. నియమ నిబంధనలని ఏర్పరుచుకొన్నది.


సుమోగా మారాలంటే అంత సులభం కాదు. అందుకు కఠినమైన శిక్షణ అవసరం. చాలా చిన్న వయసులో మొదలవుతుంది. మానసిక, శారీరక సామర్థ్యాల్ని పరీక్షించాకే సుమో బడిలోకి ప్రవేశం. వీళ్ళకి శిక్షణ ఇచ్చే కేంద్రాలను స్టేబుల్స్ అంటారు. పదవీ విరమణ చేసిన సుమోలే ఉపాధ్యాయులు. తిండీ నిద్ర అన్నీ అక్కడే. ఉదయం ఐదు గంటలకే నిద్ర లేవాలి. ఖాళీ కడుపుతో నాలుగైదు గంటల సాధన చేయాలి. ఆ తరువాత రెండు మూడు గంటలు ఆరామంగా వేడి నీళ్ళ స్నానం. అప్పటికే సమయం మద్యాహ్నం 12 గంటలై ఉంటుంది. ఆకలి దంచేస్తుంటుంది. అప్పుడు తినడం మొదలెడతారు. అదే రోజుకి మొదటి ఆహారం. లక్ష్యం ఒక్కటే. ఎంత ఎక్కువ తినగలిగితే అంత తినడం, అంతగా లావవ్వడం. కానీ సుమోలు రోజంతా తినరు. కేవలం రోజుకి రెండు సార్లే. అయితే సగటు మనిషి తీసుకొనే ఆహారానికి సుమారు పది రెట్లు.

జపాన్లో ఈ సుమో పోరాటాలు చాలా ప్రాచీనమైనవి. ఇప్పటికి కూడా ప్రాచీన ఆచారాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సుమోల జీవితం చాలా కట్టుదిట్టమై ఉంటుంది. వీరు సుమో అసోసియేషన్ విధించిన నిబంధనలకు లోబడి జీవించాల్సి ఉంటుంది. ఈ సంఘంలో పదవీ విరమణ చేసిన మల్లయోధులు ఉంటారు. వీరు మాత్రమే కొత్త సుమో యోధులను తయారు చేయడానికి అర్హులు. సుమో వీరుల్లో ఆరు విభాగాలు ఉంటాయి. జొనొకుచి ప్రాథమికమైనది. తరువాతవి జొనిడాన్, సాన్ డాన్మే, మకుషిత, జురియొ లు. చివరిది మాకూచి. మాధ్యమాలు పరుగులు పెట్టేది వీళ్ళవెనకే. జనాలు నీరాజనాలు పట్టేది వీళ్ళకే. చివరి రెండు దశల్ని సెకిటొరి అనీ కింది దశల్ని రికీషీ లనీ పిలుస్తారు. అంటే శిక్షణ పూర్తయిన సుమోలంతా రిషికీలే. ఎక్కువ టోర్నమెంట్లు గెలిస్తే వారిని యొకజునా అంటారు. అంటే గ్రాండ్ చాంపియన్ అన్నమాట.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి