వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 08వ వారం
ఎలమంచిలి పట్టణము 17.33N, 82.52E అక్షాంశ రేఖాంశాలవద్ద ఉంది. సముద్ర తలం నుండి దీని సగటు ఎత్తు 7 మీటర్లు(26 ఆడుగులు). విశాఖపట్నం నుండి ఇది 64 కి.మీ. దూరంలో ఉంది. ఎలమంచిలి మీదుగా హౌరా-చెన్నై రైల్వేమార్గము మరియు జాతీయ రహదారి ఎన్.హెచ్-5 (కలకత్తా-చెన్నై) పోవుచున్నవి. ఎలమంచిలి అసలు పేరు "ఎల్ల-మజలీ" అని పూర్వపు కళింగ దేశానికి గోదావరి మండలపు ఆంధ్ర రాజ్యానికి అది సరిహద్దు అని, ఉభయ రాజ్యాలవారు పన్ను వసూలుకు ఎలమంచిలిని ఒక మజలీ కేంద్రం గా వాడుకొనుట వల్ల దానికి ఆ పేరు వచ్చినదని తెలుస్తున్నది. వరి, చెరకు పంటలు పండించే పరిసర ప్రాంతానికి ఇది కేంద్రం. ప్రధానంగా చెరకు పంట ఈ ప్రాంతపు ఆర్ధిక వ్యవస్థకు ప్రముఖ వనరు. ఊరిలో 2 ప్రభుత్వ కళాశాలలు, 3 ప్రైవేటు జూనియర్ కళాశాలలు, 3 డిగ్రి కళాశాలలు, పి.జి. సెంటర్ ఉన్నాయి. 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, పశువుల ఆసుపత్రి, ఆర్.టి.సి కాంప్లెక్స్, 4 సినిమా హాళ్ళున్నాయి. గ్రామ పంచాయతి 1-3-1886 లో ఏర్పడినది. ప్రస్తుతము మేజర్ పంచాయతి మరియూ మండల కేంద్రము.
చారిత్రిక యుగాల్లో ఈ ప్రాంతంలో వాసికెక్కిన ప్రముఖ వాణిజ్య రేవుపట్నం ‘దివ్వెల’యే యలమంచిలికి 6 కి.మీ.ల దూరంలో కుగ్రామంగా నున్న నేటి దిమిలి. నౌకలకు సంకేతం సూచికంగా ఎత్తైన దీప స్తంబాలపై దివ్వెలనుపయోగించుటచే ఈప్రదేశానికి ఆ పేరు వచ్చింది. ఆనాడు సముద్రయానానికి ముందు ఆరాధించబడే దైవం”రత్నాకరస్వామి” ఆలయం నేటికి దిమిలి సమీపాన గల తెరువుపల్లి గ్రామంలో ఉంది. యలమంచిలికి 10 కి.మీ. దూరం నున్న పంచదార్ల గ్రామంలో చారిత్రిక విశిష్టత కల అతి ప్రాచీన శైవక్షేత్రం ధర్మలింగేశ్వరాలయం కలదు. ఉత్తరాంధ్రవాసుల ఆరాధ్య దైవమైన 'ఉపమాక వెంకన్న'గా పిలువ బడే వేంకటేశ్వరస్వామి ఆలయం యలమంచిలి కి 20 కి.మీ.దూరంలో కల ఉపమాక గ్రామం లో వెలిసింది. యలమంచిలిలో గల ప్రాచీన దేవాలయాలలో వీరభద్రస్వామి దేవాలయం ఒకటి
స్వాతంత్ర్యోద్యమంలో పలువురు యలమంచిలి ప్రాంతవాసులు తుదివరకూ పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. వారిలో స్త్రీలు కూడా ఉండడం విశేషం.
ఇంకా....పూర్తివ్యాసం పాతవి