వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 09వ వారం

ప్రముఖ వ్యంగ్యచిత్రకారుడు జయదేవ్ గీసిన చిత్రం

జయదేవ్ ప్రముఖ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు. 1940 సెప్టెంబర్ 13న కడపలో జన్మించాడు. ఇతని పూర్తి పేరు సజ్జా జయదేవ్ బాబు. 1959వ సంవత్సరం నుండి కార్టూన్లు (వ్యంగ్య చిత్రాలు) చిత్రిస్తూ ఉన్నాడు. గీతల్లో ఒడుపే కార్టూన్ కు ప్రాణం అన్నమాటను నిత్య సత్యం చేస్తూంటాయి ఆయన కార్టూన్లు. ఈయన తన బాల్యంలో ఎక్కువ భాగం మదరాసు లోని పాత చాకలి పేటలో గడిపాడు. చదువుకొనే రోజుల్లోనే స్వతహాగా చిత్రాలు గీయటం ప్రారంభించాడు. ఆచార్యుడిగా జంతుశాస్త్రాన్ని మదరాసులోని సర్ త్యాగరాయ కాలేజీ లో 1997 వరకు బోధించాడు.

ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో 1959లో మొదలు పెట్టి, తెలుగులో వచ్చిన దాదాపు అన్ని వార, మాస పత్రికలన్నిటిలోనూ తన వ్యంగ్య చిత్రాలను ప్రచురించాడు. అన్ని ప్రముఖ పత్రికలు, ముఖ్యంగా యువ దీపావళి సంచికలలో ఈయన కార్టూన్లు లేకుండా ప్రచురించబడేవి కాదు. 2002 వరకు ఆయన చిత్రీకరించిన వ్యంగ్య చిత్రాల సంఖ్య 40,000 పైగా ఉన్నాయి. జయదేవ్ కార్టూన్లతో వుత్తేజంపొంది ఆయనకు ఏకలవ్య శిష్యులుగా చాలా మంది తెలుగు కార్టూనిష్టులు ఏర్పడ్డారు. వారినందరిని వీలైనంతవరకు ముఖాముఖిగా కలిసి ప్రోత్సహించేవాడు. కార్టూన్ల సంకలనాలు, "గ్లాచ్చూ మీచ్యూ" అనే ఆత్మకధ రచించాడు. వివిధ సంస్థలచే సత్కరించబడ్డాడు. ధూమపానం వల్ల వచ్చే దుష్పరిణామాలను గురించిసామాజిక స్పృహ కల్గించే వ్యంగ్య చిత్రాలు కూడా గీశాడు. వ్యంగ్యచిత్రాల కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశాడు. నేపాళం, భూపాళం, (తాగుబోతు) బ్రహ్మం, మిస్టర్ నో, బాబాయ్-అబ్బాయ్ వంటి పాత్రలను కార్టూన్లలో సృష్టించి పాఠకులను అలరించాడు. అంతర్జాలంలో వ్యంగ్యచిత్రాల వెబ్సైట్ లను నిర్వహించాడు. తోటి కార్టూనిస్టులను కూడా అంతర్జాలాన్ని అధునిక సాంకేతికతలను వాడటానికి ప్రోత్సహించాడు. (ఇంకా…)