వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 33వ వారం

విశ్వనాథ సత్యనారాయణ (1895-1976) "కవి సమ్రాట్" బిరుదాంకితుడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును .

విశ్వనాధ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించాడు. జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పాడు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాధ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాధ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఈ వ్యక్తిత్వం." (ఇంకా…)