వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 08వ వారం

విద్యుత్
విద్యుత్తు లేదా విద్యుచ్ఛక్తి (ఆంగ్లం: Electricity) అనేది ఒక వాహక మధ్యఛ్చేదం గుండా ప్రమాణ కాలంలో ప్రవహించే ఎలక్ట్రాన్ ల ప్రవాహం. దీనిని ఆంపియర్ అనే యూనిట్స్‌లో కొలుస్తారు. ఒక కులాం ఆవేశం ఒక సెకను కాలంలో ఒక వాహక మధ్యఛ్చేదం దాటితే ఒక ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తుంది అని అంటాం. విద్యుత్ప్రవాహం ప్రమాణం ఆంపియర్ లేదా కులాం/సెకను.క్రీ.పూ 600 సం. లో గ్రీసు దేశంలో థేల్స్ అనేశాస్త్ర వేత్త మొదట విద్యుచ్చక్తి ఉనికిని గుర్తించాడు. ఆ దేశంలో amber(సీమ గుగ్గిలం) ను చెట్ల యొక్క రెసిన్ నుండి తయారుచేసేవారు. ఆ గుగ్గిలాన్ని పిల్లి చర్మంలో రుద్దినపుడు ఆ పదార్థం చిన్న చిన్న తేలికైన వస్తువులను ఆకర్షించుటను గమనించాడు. గ్రీకు భాషలో ఏంబర్ కు మరియొక పేరు "electron" అందువల్ల ఆ ఆకర్షించే ధర్మమును ఎలక్ట్రిసిటి అని పిలిచినారు. ఒక వస్తువును వేరొక వస్తువుతో రాపిడి చేసినపుడు ఒక పదార్థం యొక్క ఉపరితలంలో గల ఎలక్ట్రాన్లు(పరమాణువులోని ప్రాథమిక కణం) ఒక తలం నుండి వేరొక తలానికి బదిలీ అవుతాయి. అపుడు ఎలక్ట్రాన్లు కోల్పోయే వస్తువు తల ధనాత్మకం గాను, ఎలక్ట్రాన్లు గ్రహించిన తలం ఋణాత్మకం గాను యేర్పడుతుంది. ఈ రకమైన విద్యుఛ్చక్తిని స్థిర విద్యుత్ అందురు. క్రీ.శ 1600 సం.లో గిల్ బర్ట్ అనే శాస్త్రవేత్త రెండు రకాల ఆవేశాలుంటాయని ప్రతిపాదించాడు. (ఇంకా…)