వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 23వ వారం

సూపర్ నోవా
సూపర్నోవా సాధారణ నోవా కన్నా అతిశక్తిమంతమైన పేలుడు. సూపర్నోవా ఒక్కసారిగా విడుదల చేసే శక్తి వల్ల ఒక్కసారిగా మొత్తం గెలాక్సీ కంటే ఎక్కువ వెలిగిపోతుంది. తర్వాత కొన్ని వారాల నుండి కొన్ని నెలలలోపు మొత్తంగా ఆరిపోతుంది. ఈ సమయంలో అది సూర్యుడు తన జీవితకాలం మొత్తంలో విడుదల చేసే శక్తి కన్నా ఎక్కువ శక్తి విడుదల చేస్తుంది. ఈ పేలుడు వల్ల నక్షత్రంలోని పదార్థం అంతా 30,000కి.మీ/సె వేగంతో(కాంతి వేగంలో పదో వంతు) అన్నివైపులకి విసిరివేయబడి, అంతరిక్షంలో ఒక అలజడి తరంగాన్ని (shock wave) సృష్టిస్తుంది. సూపర్నోవాలు చాలా రకాలు. చాలా పెద్ద నక్షత్రాలు వాటిలోని ఇంధనం అయిపోయిన తర్వాత కేంద్రకసంలీనం ద్వారా శక్తిని విడుదల చేయడం ఆపివేసిన తర్వాత, గురుత్వ సంకోచం కారణంగా న్యూట్రాన్ నక్షత్రంగానో, కాలబిలంగానో మారి, వాటిలోని గురుత్వ స్థితిజ శక్తి నక్షత్రం పై పొరలను వేడెక్కించి పేల్చివేయడం వల్ల సూపర్ నోవాలుగా మారతాయి. కొన్ని మరుగుజ్జు నక్షత్రాలు వాటి సహనక్షత్రం నుండి పదార్థాన్ని గ్రహించి కర్బన సంలీనానికి సరిపడినంత కేంద్రక ఉష్ణోగ్రతని పెంచుకొని, అదుపులేని కర్బన సంలీనం వల్ల పేలిపోయి సూపర్ నోవాలుగా మారతాయి. సూర్యుడిలాంటి చిన్న నక్షత్రాలు మరుగుజ్జు నక్షత్రాలుగా మారతాయి కానీ సూపర్నోవాలుగా మారవు. పాలపుంతలో 1604 నుండి సూపర్నోవాలను గమనించకపోయినప్పటికీ, సూపర్ నోవా శకలాల విశ్లేషణని బట్టి సగటున ప్రతి 50సం.లకు ఒక సూపర్నోవా సంభవిస్తుందని అంచనా. అంతరిక్షంలో భార మూలకాల సృష్టిలో సూపర్నోవాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అవి సృష్టించే అలజడి తరంగం కొత్త నక్షత్రాల పుట్టుకకి కారణం అవుతుంది.

(ఇంకా…)