వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 36వ వారం

బొంగరము

బొంగరము కొయ్య తో చేయబడిన ఒక ఆట వస్తువు. దీనికి తాడు కట్టి బలంగా తిప్పితే కొద్దిసేపు గుండ్రంగా తన అక్షం చుట్టూ తిరుగుతుంది. పల్లెలలో ఒకప్పుడు పిల్లా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరు బొంగరాలు తిప్పేవారు. దీనిని తిప్పడానికి వాడే త్రాడుని ప్రత్యేకంగా తయారు చేసేవారు. దీనిని జాటీ అంటారు. దీనితో బొంగరాల ఆట కూడా ఆడతారు. ఇందులో ఓడిపోయినవారి బొంగరాన్ని ఒక గుండ్రని వలయాకారపు గుంతలో ఉంచి అందరూ దానిని గురి చూసి కొడతారు. తాడుతో బొంగరం తిప్పటం ,ఎక్కువ సేపు తిరిగేలా చేయటం ,అరచేతిలో బోగారాన్ని ఆడించటం గొప్ప నైపుణ్యానికి పరీక్షే . మారుతున్న కాలంతో పాటు ఈ గ్రామీణ క్రీడ కనుమరుగవుతోంది. ఇప్పుడు ప్లాస్టిక్ బొంగరాలు కూడా వస్తున్నాయి.

బొంగరము అనునది తన అక్షం చుట్టూ తిరిగి భ్రమణ చలనం చేస్తుంది. ఇది చెక్కతో చేయబడి పై వైశాల్యం కన్నా క్రింది వైశాల్యం తగ్గించబడి ఉంటుంది. క్రింది భాగం చివర లోహపు ముల్లు ఉంటుంది. ఈ ముల్లుకు ఒక ప్రత్యేక త్రాడు(జాటీ) ను సర్పిలాకారంగా అనేక సార్లు చుట్టి దానిని మన వేళ్ళ ద్వారా ఒకే సారి లాగి వదిలినపుడు అది దాని అక్షంపై భ్రమణం చేస్తుంది. ఆధార వైశాల్యం తక్కువ ఉన్నందువల్ల ఘర్షణ బలం తగ్గించబడుతుంది. అందువల్ల చాలా సేపు తన అక్షంపై తిరుగుతుంది. ఈ తిరిగే బొంగరాలు ప్రపంచం లోని చాలా ప్రాంతముల సంస్కృతి లో భాగమైనాయి. గోళీకాయ పరిమాణంలో మట్టి ముద్దను తీసుకుని దాన్ని చేతితో వత్తుతూ నేలపై గుండ్రంగా వత్తాలి. దాన్ని పిప్పరమెంట్ బిళ్ళ ఆకారంలో తయారు చేసి దాని మధ్యలో చిటికెన వేలంత పొడవుండే కొబ్బరి ఈన గుచ్చాలి. ఈన గుచ్చుకున్న ప్రాంతంలో మట్టి బిళ్ళ కు పైన కింద చిన్న బొడిపెల వోత్తగానే మట్టి బొంగరం రెడి. దీనిపైన చిన్న తగరపు పొర ను అంటిస్తే బొంగరం తిరిగేటపుడు కలరపుల్ వుంటుంది. ఈ మట్టి బొంగరాన్ని తిప్పడం కూడా ఒక టాలెంట్ అనొచ్చు.

(ఇంకా…)