వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2014 36వ వారం

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి అవధాన విద్యకు రూపురేకలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో ఒకరు. దివాకర్ల తిరుపతిశాస్త్రితో జంటగానూ, ఆయన మరణానంతరం విడిగానూ ఎన్నో పద్యనాటకాలు, కావ్యాలు, వచన రచనలు రచించారు. చెళ్లపిళ్ల తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆయన శిష్యులుగా చదువుకున్నవారు చాలామంది ఆ తర్వాతి కాలంలో తెలుగు సాహిత్యరంగంలో, భాషాశాస్త్రంలోనూ కవులుగా, పండితులుగా ప్రఖ్యాతి పొందారు. కవనార్థం బుదయించినట్లు చెప్పుకున్న చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి జీవితంలో చాలావరకూ కావ్యరచన, ఆశుకవిత్వం చెప్పడం, నాటకాలు రచించడం, పలువురు సంస్థానాధీశుల సందర్శనాలు, వారి సముఖంలో అవధాన ప్రదర్శనలు, సాహిత్య స్పర్థలు, వివాదాలు వంటి వాటిలోనే గడిచాయి. శత్రువులను, మిత్రులను, శిష్యులను సంపాదించుకున్నా, ఏనుగునెక్కిన గౌరవం, కోర్టు మెట్లెక్కాల్సిన చికాకులు ఎదురైనా అన్నిటికీ సాహిత్యరంగమే మూలం. గురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి ఆదేశంతో దివాకర్ల తిరుపతిశాస్త్రితో కలిసి అవధానాలు ప్రారంభించారు. 1891లో కాకినాడలో చేసిన శతావధానమే తిరుపతి వేంకటకవులుగా వీరి తొలి ప్రదర్శన. అందులో వారు చెప్పిన పద్యాల్లో వ్యాకరణ దోషాలున్నాయని పెద్ద పండితులు శంకించారు. తిరుపతి వేంకట కవులు కూడా నోరు మెదపకుండా అవి నిజంగా తప్పులే అని అందరికీ అనుమానం వచ్చేటట్టుగా ప్రవర్తించారు. శతావధానం చివరిలో ప్రధానసభకు ముందు జరిగిన ఉపసభలో ఆయా శంకలు అన్నీ వరుసగా చెప్తూ పూర్వ మహాకావ్యాల ప్రయోగాలు ఉదహరించి ఎగరగొట్టారు.

(ఇంకా…)