వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2014 37వ వారం
హుస్సేన్ సాగర్ హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఒక మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలములో హజ్రత్ హుస్సేన్ షా వలీచే నిర్మింపబడింది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఈ సరస్సు నగరము యొక్క మంచినీటి మరియు సాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ నది యొక్క ఒక చిన్న ఉపనదిపై నిర్మించబడింది. చెరువు మధ్యలో హైదరాబాదు నగర చిహ్నముగా ఒక ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని 1992లో స్థాపించారు. దీనికి పక్కన నెక్ లెస్ రోడ్ ఉంది. 1562లో హుస్సేన్ సాగర్ నిర్మాణాన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షా కట్టించినా, దాని నిర్మాణ పర్యవేక్షణ మాత్రం ఇబ్రహీం కులీ అల్లుడు, పౌర నిర్మాణాల సూపరిండెంటైన హుస్సేన్ షా వలీ చేపట్టాడు.చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవటంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 32 అడుగుల లోతుతో చెరువు ఉండేది. కుతుబ్ షా ఈ సరస్సుకు ఇబ్రహీం సాగర్ అని పేరుపెట్టాలని అనుకున్నాడు, కానీ హుస్సేన్ వలీ యొక్క ప్రాచ్యుర్యము వలన ప్రజలు ఆయన పేరు మీదుగా హుస్సేన్ సాగర్ చెరువు అని పిలవటం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న సుల్తాను చెరువులకున్న ప్రజాదరణను గమనించి వెంటనే తన పేరు మీద గోల్కొండకు 16 మైళ్ళ దూరములో ఇబ్రహీంపట్నం చెరువును నిర్మింపజేశాడు.1568లో హుస్సేన్ సాగర్ చుట్టూ గట్టుగా నిర్మించబడిన రోడ్డును టాంక్ బండ్ అంటారు. ఈ రోడ్డు హైదరాబాదు మరియు సికింద్రాబాదు జంట నగరాలను కలుపుతుంది .
(ఇంకా…)