వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2014 38వ వారం

బతుకమ్మ

బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రములో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. సెప్టంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంరంభాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలుతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. ఇతర చోట్ల పూలు, నీళ్లతో జరుపుకునే పండుగలు ఎన్ని ఉన్నా, అవి ఏవీ కూడా బతుకమ్మ పండుగతో సరిపోలవు.ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాల వలన చెరువలన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుక పూలు, తంగేడి పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు (శిల్పక్క పండ్లు అంటారు) కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ.


(ఇంకా…)