వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2014 39వ వారం

కొమురం భీమ్

కొమురం భీమ్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించి వీరమరణం పొందాడు. కొమురం భీమ్ గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్ సోంబాయి దంపతులకు 1900 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకా లోని సంకేపల్లి గ్రామం లో జన్మించాడు. భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు మరియు జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 సెప్టెంబర్ 1 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. అది గిరిజనులు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ద పౌర్ణమి కావడంతో అప్పటి నుండి ఆ తిధి రోజునే ఆదివాసీలు కొమురం భీమ్ వర్ధంతిని జరుపుకొంటూ వస్తున్నారు.



(ఇంకా…)