వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 02వ వారం

హరికథ

ఆంధ్ర దేశంలో అన్ని జానపద కళారూపాలతో పాటు వర్ధిల్లి ప్రజాభిమానాన్ని చూరగొన్న కళారూపాలలో ముఖ్యమైన హరికథా గానం ఆంధ్రుల హరికథా చరిత్రలో హరికథ ఒక ప్రత్యేకతనూ, గౌరవాన్నీ సంపాదించింది. హరిలీల లను చెప్పే విధానమును హరికథ అంటారు. దీనికి తెలుగు సాహిత్యంలో చాలా ప్రాముఖ్యత కలదు. నారదుడు మొదటి హరిదాసు అంటారు. దానిని ఒక విశిష్ట కళారూపంగా తీర్చి దిద్దిన వాడు ఆదిభట్ల నారాయణదాసు. బ్రహ్మశ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ప్రముఖ హరికథ విద్వాంసుడు మరియు అష్టభాషాపండితుడు. హరికథ సంగీత, సాహిత్యాల మేలు కలయిక. ఈ కథ చెప్పువారిని భాగవతులు లేదా భాగవతార్ అని అందురు. ఆధునిక యుగంలో ఆదిభట్ల నారాయణదాసు, పరిమి సుబ్రహ్మణ్యం భాగవతార్ మొదలగువారు ఈ ప్రక్రియలో ఆద్యులు. హరికథా కళారూపంలో ఒకే ఒక్క పాత్ర ధారి మూడు గంటల కాలం కథా గానం కావిస్తాడు. ఒకే వ్వక్తి అన్ని పాత్రల్లోనూ జీవించి, రసవత్తరంగా నటిస్తాడు. నోటితో వాచికం చెపుతూ, మృదుమధురమైన గానం పాడుతూ, ముఖంలో సాత్వికమూ, కాలితోనృత్యమూ, చేతులతో ఆంగికమూ గుప్పిస్తూ ఆకర్షణీయమైన ఆహార్యంతో ఏకకాలంలో అభినయిస్తాడు. హరికథలో ఉన్న ప్రత్యేకత ఇదే. మూడు గంటల కాలం కూర్చున్నా ప్రేక్షకులకు విసుగు జనించకుండా పిట్ట కథలతో, మధ్య మధ్య హాస్యరసాన్ని పోషిస్తూ సమాజంలో వున్న కుళ్ళు ఎత్తి చూపిస్తూ, వేదాంత బోధ చేస్తూ జనరంజకంగా హరికథను గానం చేస్తాడు.

(ఇంకా…)