వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 26వ వారం

పిక్టోరియలిజం

పిక్టోరియలిజం అనునది 19 ద్వితీయార్థంలో మరియు 20వ శతాబ్దంలో ఫోటోగ్రఫిని అంతర్జాతీయ స్థాయిలో నడిపించిన ఒక కళా ఉద్యమం. ఈ పదానికి ప్రామాణిక నిర్వచనం లేకున్ననూ ఇది సాధారణంగా యథాతథంగా ఏర్పడే ఛాయాచిత్రాన్ని కేవలం నమోదు చేయటానికి మాత్రమే పరిమితం కాకుండా, ఛాయాగ్రహకుడు ఏదో ఒక విధంగా దానిని మార్చి ఒక భావాత్మకమైన ఛాయాచిత్రాన్ని సృష్టించే శైలిని సూచిస్తుంది. సాధారణంగా ఒక పిక్టోరియల్ ఛాయాచిత్రం స్పష్టత లోపించినదై బ్లాక్-అండ్-వైట్ కే పరిమితం కాకుండా వార్మ్‌ బ్రౌన్ లేదా ఊదా రంగులలో ముద్రితమై కుంచెతో అక్కడక్కడా మెరుగులు అద్దబడి, ఏర్పడిన ఛాయాచిత్రం యొక్క అందాన్ని పెంచేవిధంగా ఉంటుంది. ఒక పిక్టోరియలిస్ట్ కళాకారుడికి ఛాయాచిత్రం ఒక చిత్రపటం వలె భావోద్రేక ఉద్దేశ్యాన్ని వీక్షకుని ఊహాలోకాన్ని ప్రభావితం చేసేదిగా ఉంటుంది.పిక్టోరియలిజం 1885 నుండి 1915 వరకు ఉద్యమంగా వర్థిల్లిననూ 1940 వరకూ ఈ కళని ప్రచారం చేసినవారూ లేకపోలేదు. ఒక ఛాయాచిత్రం కేవలం వాస్తవాన్ని నమోదు చేయుటకు మాత్రమే ఉపయోగపడుతుంది అనే విమర్శనాత్మక ప్రస్తావనను వ్యతిరేకిస్తూ ఉద్భవించిన పిక్టోరియలిజం ఫోటోగ్రఫి ని ఒక కళగా గుర్తించి అంతర్జాతీయ ఉద్యమంగా రూపుదిద్దుకొన్నది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా చిత్రకారులు, ఛాయాచిత్రకారులు మరియు కళావిమర్శకులు వ్యతిరేక అభిప్రాయాలతో చర్చించిన తర్వాత ఛాయాచిత్రాలను పలు కళా ప్రదర్శనశాలలు కైవసం చేసుకొన్నాయి.

(ఇంకా…)