వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 40వ వారం

బెల్లం
బెల్లం ఒక తియ్యని ఆహార పదార్థము. దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లి బెల్లం తయారీకి ప్రసిద్ధి. పామే కుటుంబానికి చెందిన తాటి, జీలుగ చెట్లనుండి కూడా బెల్లం తయారవుతుంది. చెరకు గడలను కొట్టి ఆ పొలంలోనే ఏర్పాటు చేసుకొన్న గానుగ వద్దకు చేర్చి అందులో నుండి రసం తీసి దాన్ని పెద్ద పెనంలో కాగబెట్టి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లం. నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను ఉంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. గట్టి దనాన్ని రైతు పరి భాషలో రాపు లేదా జేడు అంటారు. పక్వానికొచ్చిన చెరకును కొట్టి ఆ పొలంలోనే ఏర్పాటు చేసుకొన్న గానుగ వద్దకు చేర్చి, వాటిని శుభ్రం చేసి, గానుగ దగ్గరికి చేరుస్తారు. చెరకు పైనున్న ఆకులను తీసేవేసి వాటిని గానుగలో పెట్టి రసం తీస్తారు. ఆ రసాన్ని పెద్ద ఇనుప రేకుతో చేసిన పెనంలో సేకరించి దాన్ని బాగా కాగ బెడతారు. చెరకు పాలు బెల్లంగా తయారు కావడానికి కొన్ని దశలుంటాయి. ఈ చెరకు పాలు కాగేటప్పుడు మొదటగా బుడ్డ పగలడం అంటారు. అనగా బాగా కాగిన ఆ రసం అందులోని మురికి అంతా ఒక పెద్ద తెట్టుగా పైన చేరుతుంది. అనగా పొంగు రావడానికి తొలి దశ అన్నమాట. అప్పుడు ఆ మురికిని ఒక ప్రత్యేకమైన సాధనంతో తీసి వేయాలి. ఆ తర్వాత ఆ చెరుకు రసం తెర్లుతుంది. ఇలా కొంత సేపు తెర్లి.. చీమల పొంగు అనే దశకు చేరు కుంటుంది.
(ఇంకా…)