వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 51వ వారం
షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు.వినాయకుని తమ్ముడు. దేవతల సేనాధిపతి. ఈయనకే 'స్కందుడు' అని, 'కార్తికేయుడు' అని, 'శరవణుడు' అని, 'సుబ్రహ్మణ్యుడు' కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము నెమలి. స్కంద పురాణంలో ఈయన గాధ వివరంగా ఉన్నది. ఇతన్ని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్టి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు జరుపుకొంటారు. ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు. ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమయ్యిందట.జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారి గా వుండి పోయాడట. సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివునినుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరుభాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారు.
(ఇంకా…)