వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 01వ వారం

మిస్సమ్మ (1955 సినిమా)
మిస్సమ్మ 1955లో విడుదలైన తెలుగు చిత్రం. ఇది ఒక అద్భుతమైన పూర్తినిడివి హాస్య చిత్రం. ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అతి పెద్ద హీరోలుగా పేరు గాంచిన నందమూరి తారక రామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఘన విజయము సాదించిన ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించినది మాత్రము మహానటి సావిత్రి. ఎస్వీ రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య, ఋష్యేంద్రమణి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, బాలక్రిష్ణ, దొరైస్వామి తదితరులు నటించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా ఒక చిన్న పాత్రలో మీకు కనిపిస్తారు. సావిత్రికి ఈ సినిమాతో చక్కని అభినేత్రిగా మంచి పేరు వచ్చింది. ఆమె ఇక చిత్ర పరిశ్రమలో తిరిగి చూడ లేదు. మిస్సమ్మ చిత్రము యొతిష్ బెనర్జీ అనే బెంగాలి రచయిత యొక్క "మన్మొయీ గర్ల్స్ స్కూల్" అనే హాస్య రచన ఆధారంగా చక్రపాణి మరియు పింగళి నాగేంద్రరావులు రచించగా ఎల్వీ ప్రసాదు దర్శకత్వంలో రూపొందిచబడినది. సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, రేలంగి, అల్లు రామలింగయ్య మొదలైన వారి నటనతో సినిమా పూర్తి వినోదాత్మకంగా రూపొందింది. ఈ సినిమాకు పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నదగ్గ వాటిలో కొన్ని. ఆయన సాహిత్యమూ, ఎ.ఎం.రాజా, పి.లీల, పి.సుశీల గార్ల గాత్రమాధుర్యమూ కలిసి మిస్సమ్మ సినిమా పాటలను అజరామరం చేసాయి. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలు ఈనాటికీ తెలుగు వారిని అలరిస్తూ ఉన్నాయి. పి.లీల పాడిన కరుణించు మేరిమాత అనేపాట హృదయాలను తాకుతుంది.
(ఇంకా…)