వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 08వ వారం
వేమూరి గగ్గయ్య (ఆగష్టు 15, 1895 - డిసెంబర్ 30, 1955) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా నటుడు. దుష్టపాత్రలు ధరించేవాళ్లకు ప్రేక్షకాదరణా, ప్రేక్షకారాధనా వుండవన్న అభిప్రాయాన్ని అబద్ధం చేసిన వేమూరి గగ్గయ్య నాటి చిత్రాల మహోజ్జ్వలతార! రౌద్రపాత్రధారణకు మార్గదర్శి. ఈయన 15 ఆగష్టు 1895 తేదీన గుంటూరు జిల్లా వేమూరు లో జన్మించారు. సినిమాలలో రాక ముందు ప్రసిద్ధి చెందిన రంగస్థల నటుడైన గగ్గయ్య క్రూర పాత్రలకు పెట్టింది పేరు. సినిమా నటుడైన తర్వాత, ప్రేక్షకజనం విడిగా గగ్గయ్యని చూడాలని ఉబలాటపడేవారు, వెంటపడేవారు. అంతకు ముందు సినిమాలు చూసి వచ్చినవాళ్లు ఊరికే పేరు చెప్పుకుని ఊరుకునేవారు గాని గగ్గయ్యతో ఊరుకోలేదు. ఒక విధంగా తారారాధన గగ్గయ్యతోనే మొదలైందని చెప్పవచ్చు. ఆయన చిన్నతనంలో సంగీత సాధనతో మొదలైన కళాభిమానం - నటనవైపు తిరిగింది. తానుగా నటనను అభ్యసించి, ధాటిగా పెద్దశ్రుతితో పద్యాలు ఆలపించడంలో దిట్ట అనిపించుకుని సురభివారి నాటకాల్లో పాత్రలు ధరించడంతో నటజీవితం ఆరంభించారు గగ్గయ్య. నాటకాలతో ఊళ్లూ, దేశాలూ తిరిగారు. ఒక్క రంగూన్‌లోనే పదిమాసాలపాటు వుండి నాటకాలు ప్రదర్శించారుట. తర్వాత తెనాలి వచ్చి ఫస్టుకంపెనీ అనే నాటక సంస్థలో చేరి, పాత్రధారణ చేశారు. మైలవరం కంపెనీ మహానందరెడ్డి బృందం గగ్గయ్యగారి నటనాశక్తిని బాగా వినియోగించుకున్నాయి. నాటకాల్లో నటిస్తున్నా సాధన మానలేదు.
(ఇంకా…)