వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 10వ వారం

సునీతా కృష్ణన్

సునీతా కృష్ణన్ ఒక ప్రముఖ సంఘసేవకురాలు. ప్రజ్వల అనే సేవాసంస్థ స్థాపించి అందులో ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన ఆడపిల్లలను రక్షించి వారిని తిరిగి మంచి జీవితాల్ని ప్రసాదించడం ఈ సంస్థ యొక్క ప్రధానోద్దేశ్యం. 2016 లో ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆమె కథ అందించి ఆమె భర్త రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో రూపొందిన నా బంగారు తల్లి అనే సినిమాకి నాలుగు జాతీయ సినిమా పురస్కారాలు లభించాయి. సునీత బెంగుళూరులో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు కేరళ నుంచి వచ్చి బెంగుళూరులో స్థిరపడ్డ రాజు కృష్ణన్, నళిని కృష్ణన్. ఆమె తండ్రి సర్వే ఆఫ్ ఇండియా అనే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేవాడు. భారతదేశానికంతా మ్యాపులు గీయడం ఈ సంస్థ కర్తవ్యం. ఆయన ఉద్యోగరీత్యా ఆమె దేశంలో పలు ప్రాంతాలు చూడగలిగింది. ఆమె 8 సంవత్సరాల వయసులోనే మొదటి సారిగా మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు నాట్యం నేర్పడంతో సమాజ సేవ వైపు ఆకర్షితురాలైంది. పన్నెండేళ్ళ వయసొచ్చేసరికి మురికివాడల్లో పాఠశాలలు ప్రారంభించింది. పదిహేనేళ్ళ వయసులో దళితుల పక్షాన ఒక ఉద్యమంలో పాల్గొనడంతో ఆమెను ఎనిమిది మంది దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ సంఘటనే ఆమెను ప్రస్తుతం చేస్తున్న సేవకు పురిగొల్పింది.
( మార్చి 8 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా)

(ఇంకా…)