వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 37వ వారం

పెరుగు శివారెడ్డి

పెరుగు శివారెడ్డి (సెప్టెంబర్ 12, 1920 - సెప్టెంబర్ 6, 2005) ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. పెరుగు శివారెడ్డి కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు గ్రామంలో 1920 , సెప్టెంబరు 12 న జన్మించారు. ఈయన తండ్రిపేరు పి.హెచ్.రెడ్డి. ఆయన 1946లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.బి.యస్. (డాక్టరు) పట్టాని పొంది 1952లో నేత్రవైద్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.యస్. పట్టాని స్వీకరించారు. ప్రారంభ ఉద్యోగం మద్రాసు మెడికల్ సర్వీసెస్ లో అసిస్టెంట్ సర్జన్ (1949-53) ఆంధ్ర మెడికల్ కాలేజి, కె.జి (కింగ్ జార్జి) హాస్పిటల్, విశాఖ పట్టణంలో ఆఫ్తాల్మోలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసిస్టెంట్ సర్జన్ గా (1953-56) పనిచేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ, హైదరాబాద్ (1958 - 61) సరోజినీ ఐ హాస్పటల్ ఆహ్వానం మీద అక్కడ సూపరిండెంట్ గా, అఫ్తాల్మాలజీ ప్రొఫెసర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. 1961-75 తర్వాతి కాలంలో రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో చేరారు. అప్తాల్మాలజీ డైరక్టరుగా (1978-81) పోస్టు గ్రాడ్యుయేషన్ స్టడీస్ కు ప్రొఫెసరుగా (1975 - 78) వ్యవహరించారు. రాష్ట్రంలో అనేక గ్రామాలలో కాటరాక్ట్ సమస్యలతో బాధపడేవారున్నారని గ్రహించారు. ఈ రోజున ఉన్న విధంగా అన్ని ఊళ్లలో కంటి వైద్యులు అందుబాటులో లేరు. కంటివైద్యం చాలా సమస్యాత్మకంగా ఉండేది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కంటి చూపే పోతుందని సమస్యలను అవగాహన చేసుకొని ఊరూరా క్యాంపులు నిర్వహించి ప్రజలను ఎడ్యుకేట్ చేశారు. ఆపరేషన్లు నిర్వహించారు. మన దేశంలో ఈ తరహాగా ఐ క్యాంఫులు, నిర్వహించడం తొలిసారి. దాదాపు 500 క్యాంపులు, మూడు లక్షల కాటరేక్ట్ ఆపరేషన్లు చేశారు. సొంత డబ్బు చాలా ఖర్చు చేశారు.

(ఇంకా…)