వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 44వ వారం

మంచుమనిషి
మంచుమనిషి అనునది సామాన్యశక పూర్వం 3,359 - 3105 సంవత్సరాల మధ్య నివసించిన పురుషుని యొక్క మమ్మీ. ఇది ప్రకృతి సహజంగా తయారైన మమ్మీ. ఈట్జల్ ఆల్ప్స్ పర్వతాల్లో లభించింది కాబట్టి ఈ మమ్మీని ఈట్జి అని కూడా పిలుస్తున్నారు. ఈ వ్యక్తి సా.పూ 3239 - 3105 సంవత్సరాల మధ్య మరణించి ఉండేందుకు 66 శాతం అవకాశాలున్నాయి. 1991 సెప్టెంబరులో, ఈట్జల్ ఆల్ప్స్ పర్వతాల్లో, ఆస్ట్రియా, ఇటలీల సరిహద్దు వద్ద ఈ మమ్మీని కనుగొన్నారు. ఇది ఐరోపాకు చెందిన, అత్యంత పురాతన, ప్రకృతిసహజ మమ్మీ. రాగియుగపు యూరపియన్ల గురించి పరిశోధకులకు అంతకుముందు తెలియని సమాచారం ఈ మమ్మీ ద్వారా లభించింది. అతడి దేహాన్ని, వస్తువులనూ ఇటలీ, దక్షిణ టైరోల్ లోని పురావస్తు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు. 1991 సెప్టెంబరు 19 న ఆల్ప్స్ పర్వతాల్లో 3,210 మీటర్ల ఎత్తున ఇద్దరు జర్మను యాత్రికులు హెల్ముట్ సైమన్, ఎరికా సైమన్‌లకు ఈట్జి కనబడింది. వారు ఈ మమ్మీని చూసినపుడు, అది ఇటీవలే మరణించిన పర్వతారోహకు డెవరిదైనా శవమై ఉంటుందని భావించారు. మరుసటి రోజున ఒక పర్వత ప్రాంత పోలీసు, సమీపంలోని పర్వత విడిది కీపరు ఒకతనూ కలిసి, నడుం దాకా మంచులో దిగబడి ఉన్న ఆ దేహాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించారు. కానీ వాతావరణం అనుకూలించక మధ్యలోనే ఆపేసారు.

(ఇంకా…)