వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 48వ వారం

పాలెగాళ్లు

పాలెగాళ్లు దక్షిణ భారతదేశంలోని ప్రాంతాలను పరిపాలించిన రాజులు. పాలెగాళ్లను తమిళంలో పాలైయాక్కరర్ అని, తెలుగులో పాలెగాడని, కన్నడంలో పాళె యగరరు అని అంటారు. వీళ్లు క్రీ.శ.17, 18వ శతాబ్దాల్లో సాయుధులై పాలన సాగించారు. విజయ నగర రాజ్య పతనానంతరం పాలెగాళ్ల పాలన ప్రారంభమైంది. క్రీ.శ.1800 నాటికి సీమలో 80 మంది పాళెగాళ్లు, 30 వేల మంది సైని కులు ఉండేవారు. క్రీ.శ.1600 నుండి క్రీ.శ.1800 వరకు రాయలసీమ ప్రాంతంలో బలమైన రాజుల పాలన లేదు. పాళెగాళ్ల పాలనే రాయలసీమలో ఉండేది. సీమలో దండయాత్రలు జరిగినప్పుడు గండికోట, సిద్ధవటం కోట పరాయి రాజుల వశమైనప్పటికీ బురుజులు మాత్రం పాళెగాళ్ల ఆధీనంలోనే ఉండేవి. విజయనగర రాజుల కాలంలోనే ( క్రీ.శ. 1336-1680) పాళెగాళ్ల వ్యవస్థ ఏర్పడింది. రాయలసీమలో పాళెగాళ్లు విజయనగర రాజులకు పన్నులు వసూలు చేయడంలోనూ, అంతర్గత రక్షణ కల్పించడంలోనూ, రాజులకు అవసరమైన సైన్యాన్ని సమీకరించడంలోనూ సహాయపడేవారు. క్రీ.శ.1565 లో జరిగిన తళ్లికోట యుద్ధం లో సుల్తానుల చేతులలో పరాజయం పొందిన విజయనగర రాజులు తమ రాజధానిని బళ్లారి జిల్లాలోని హంపీ నుంచి అనంతపురం జిల్లాలోని పెనుగొండ కు మార్చారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సలహాతో బీజాపూర్, గోల్కొండ నవాబులు ఉమ్మడిగా 1650 లో పెనుగొండ మీద దాడి చేసి విజయనగర రాజ్యాన్ని ధ్వంసం చేశారు.

(ఇంకా…)