వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 11వ వారం

గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి

గోవిందరాజ స్వామి ఆలయం, తిరుపతి పట్టణంలో ఉన్న ఒక ఆలయం. ఇది తిరుపతి రైల్వే స్టేషను సమీపంలోనే, కోనేటి గట్టున ఉంది. ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజ స్వామి. ఈయన శ్రీవేంకటేశ్వరునికి అన్న అని అంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకొంటున్నాడట. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానములు సంస్థ నిర్వహణలోవే ఉంది. ఆలయానికి రెండు గోపురాలున్నాయి. బయటి ఈ ఆలయం గాలి గోపురం బాగా పెద్దది. లోపలి వైపు గోపురం ఇంకా పురాతనమైనది. రామాయణ భాగవత గాధల శిల్పాలతో గోపురం అందంగా ఉంటుంది. గోవిందరాజస్వామి విగ్రహం శేషశాయి ఆదిశేషునిపై పడుకున్నట్టుగా ఉంటుంది. ఉత్తరదిక్కుకు పాదాలు, దక్షిణదిశలో తల పెట్టుకుని, శంఖ చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై, నాభికమలంలో బ్రహ్మతో, తలపై కిరీటం, దివ్యాభరణాలతో ఉంటారు గోవిందరాజస్వామి. మూల విరాట్టు గోవిందరాజ స్వామితో బాటు, అండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణుడు, శ్రీరామానుజ తిరుమంగై ఆళ్వారు, శ్రీ వేదాంత దేశికులు, శ్రీ లక్ష్మి, శ్రీ మనవాళ మహాముని సన్నిధులున్నాయి. ఉత్తర దిశ ఆలయంలో అనంత శయనుడైన విష్ణుమూర్తి రూపంలో గోవిందరాజ స్వామి కొలువైయున్నాడు. ఆలయం దక్షిణ భాగాన రుక్మిణీ సత్యభామా సహితుడైన పార్ధ సారధి మందిరం ఉంది. వైశాఖ మాసంలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

(ఇంకా…)