వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 26వ వారం

కొలకలూరి ఇనాక్

కొలకలూరి ఇనాక్ తెలుగు రచయిత మరియు సాహితీకారుడు. ఆయన అనేక వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి. ఈయన చేసిన కృషికి తగ్గ ఫలితంగా 2014 లో భారత ప్రభుత్వం "'పద్మశ్రీ"' పురస్కారం ప్రకటించి గౌరవించినది. 2015లో భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ వారు ఇచ్చే మూర్తిదేవి పురస్కారం ఇతని "అనంత జీవనం" అనే రచనకు లభించింది. ఈయన వేజెండ్ల గ్రామంలో నిరుపేద కుటుంబీకులైన రామయ్య, విశ్రాంతమ్మ దంపతుల సంతానంగా, 1939, జులై-1న జన్మించాడు. గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురం, తిరుపతి వంటి ప్రదేశాలలో తెలుగు ఆచార్యుడుగా పనిచేసి, అంచెలంచెలుగా ఎదుగుతూ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవి అందుకున్నాడు. మరోవైపు తెలుగు సాహితీ ప్రక్రియలో, తనదైన శైలికి వన్నెలద్దుతూ, తన కలం బలం చాటాడు. 1954లో లోకంపోకడ, ఉత్తరం అనే కథానికలతో తెలుగు సాహితీ లోకంలో చేరినాడు. 1958లో "దృష్టి" అను నాటికను వ్రాసి, కేంద్రప్రభుత్వ బహుమతిని అందుకున్నాడు. 1965లో "జైహింద్" అను నాటికకు రాష్ట్రప్రభుత్వ బహుమతిని దక్కించుకున్నాడు. 1986లో వ్రాసిన "ఊరబావి" కథాసంపుటి, రచయితగా ఆయన స్థానాన్ని చాటిచెప్పినది. 1988లో "మునివాహనుడు" కథాసంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించినది. ఈ రకంగా రెండు సార్లు ఈ పురస్కారాన్ని అందుకున్న అరుదైన రచయితగా ప్రసిద్ధిచెందినాడు. నవలా రచయితగా, నాటక స్రష్టగా, విమర్శకునిగా తెలుగు సాహితీ లోకానికి సుపరిచితుడైన ఈయన, పర్యవేక్షకునిగా 20 మంది శిష్యులకు పి.హెచ్.డి. పరిశోధనలో మార్గదర్శకులైనాడు.

(ఇంకా…)