వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 02వ వారం

పళని

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది. ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళులు ఈయనను “పళని మురుగా” అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని, కౌపీన ధారియై, వ్యుప్త కేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ ఉంటాడు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” - అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్థం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అంతే కాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని. ఇక్కడ పళని మందిరంలోని గర్భ గుడిలోని స్వామి వారి మూర్తి నవపాషాణములతో చేయబడింది. ఇటువంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు.


(ఇంకా…)