వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 09వ వారం
రాగి ఒక రసాయనిక మూలకము. రాగిని తామ్రం అనికూడా పిలుస్తారు. దీని అణు సంఖ్య 29. సంకేత అక్షరం Cu. ఇది ఒక లోహం. సాగకొట్టిన సన్నని తీగెలుగా సాగుతుంది. అలాగే పలుచని రేకులుగా సాగుతుంది. రాగి మంచి ఉష్ణవాహకం మరియు విద్యుత్తు వాహకం కూడా. కల్తీ లేని స్వచ్ఛమైన రాగి మృదువుగా ఉండి సులభంగా సాగే గుణం ప్రదర్శించును. రాగి ఎరుపు–నారింజ రంగుల మిశ్రమ రంగును కలిగి ఉండును. మానవుడు మొదటగా ఉత్పత్తిచేసి, ఉపయోగించిన లోహం రాగి.రాగిని ఉష్ణ మరియు విద్యుత్తు వాహకాల తయారిలోవిరివిగా వినియోగిస్తారు. అంతే కాదు గృహ వంటపాత్రలను తయారు చేయుటకు, మరియు గృహ ఉపకరములను చేయుట యందును వాడెదరు. రాగియొక్క మిశ్రమ లోహాలను ఉపయోగించి అనేక వస్తు వులను తయారు చేయుదురు. క్రీ.పూ.8000 వేల సంవత్సరాల నాటికే రాగి నుండి నాణెములను, ఆభరణము తయారు చెయ్యడం మానవునికి తెలుసు. క్రీ.పూ 5500 సంవత్సరాల సమయంలో మానవుడు రాతియుగంలో వాడే రాతి పనుముట్లకు బదులుగా రాగితోను దాని యొక్క మిశ్రమ లోహాలతోను ఆయుధాలను, పనిముట్లను తయారుచేసి వాడటము ప్రారంభించటం వలన నాటిమానవుని నాగరికతలో మార్పులు చోటు చేసుకున్నవి. రాగిని, రాగియొక్క మిశ్రమ లోహాలను కొన్ని వేల ఏండ్లుగా రోమనుల కాలంలో ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. మొదట్లో ఈ లోహం యొక్క ముడి ఖనిజాన్ని సైప్రస్ ప్రాంతపు గనులనుండి త్రవ్వి తీయడం వలన ఈ లోహాన్ని మొదట సిప్రియం అని పిలిచేవారు.
(ఇంకా…)