వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 15వ వారం

రాహుల్ సాంకృత్యాయన్

రాహుల్ సాంకృత్యాయన్ (1893 ఏప్రిల్ 9 – 1963 ఏప్రిల్ 14) హిందీ యాత్రాసాహిత్య పితామహుడిగా సుప్రసిద్ధులు. ఆయన బహుభాషావేత్త, బహుముఖప్రజ్ఞాశాలి, వైవిధ్యభరితమైన జీవితాన్ని జీవించారు. రాహుల్ సాంకృత్యాయన్ లోకసంచారిగా పేరుపొందారు. తన జీవితంలో 45 సంవత్సరాల పాటు యాత్రలలోనే గడిపారు. లోతైన తాత్త్విక చింతన కలిగిన సాంకృత్యాయన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి బౌద్ధ భిక్షువుగా మారి అనంతరం మార్క్సిస్ట్ సోషలిస్టుగా పరివర్తన చెందారు. సాంకృత్యాయన్ భారత జాతీయోద్యమంలో కూడా కృషిచేశారు. జాతీయోద్యమానికి అనుకూలంగా, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు, ప్రసంగాలు చేసినందుకు 3సంవత్సరాల కారాగార శిక్షను అనుభవించారు. విస్తృతమైన అభిరుచులు, లోతైన చింతన, విపరీతమైన సంచార జీవనం వెరసి అపురూపమైన సాహిత్యాన్ని రచించారాయన. 1940వ దశకం ప్రారంభంలో ఆయన పూర్తిగా భౌతికవాద భావాలను స్వీకరించి, కమ్యూనిస్ట్‌ పార్టీలో సభ్యునిగా చేరి, జీవితాంతం కమ్యూనిస్ట్‌గా ఉన్నారు. అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షునిగా ఆయన అనేక రైతు పోరాటాలకు నాయకత్వం వహించారు. బీహార్‌లో ఓ రైతు ఉద్యమంలో జరిగిన లాఠీఛార్జిలో ఆయనకు తలపై బలమైన దెబ్బ తగిలిగింది. రాహుల్జీ ఏక సందాగ్రాహి అని, ఆయన టిబెట్‌ భాషనుండి సంస్కృతానికి అత్యంత వేగంగా అనువాదం చెయ్యగలిగేవారనీ ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం ఉన్నవారు వివరించారు. ఆయన చేసిన రచనలలో, అనువాదాలలో చాలాభాగం ఇప్పటికీ ప్రచురణ కాలేదు.


(ఇంకా…)