వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 17వ వారం

ఎస్. జానకి

ఎస్.జానకి (జ.ఏప్రిల్ 23,1938) గా అందరికి పరిచయమైన శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి ప్రముఖ భారతీయ నేపథ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ బాషలలో పాడారు. వివిధ బాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా మలయాళం, కన్నడ బాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకటించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు మరియు 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు మరియు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంతో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు. 1957 లో విధియిన్ విలయాట్టు అనే తమిళ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన జానకి సెప్టెంబరు 2016 న తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. జానకి గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామములో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవాడు.

(ఇంకా…)