వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 18వ వారం

భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయము

శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయము తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లాకు చెందిన తాండూరు పట్టణము నడిబొడ్డున ఉన్నది. కోర్కెలు తీర్చే దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఉత్సవాలు జర్గుతాయి. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి తాండూరు, వికారాబాదు, పర్గి, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, కోడంగల్, కోస్గి నుంచే కాకుండా ప్రక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా విపరీతంగా వస్తుంటారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో చివరి రెండు రోజులు ప్రధానమైనవి. శని, ఆది వారాల్లో జరిగే రథోత్సవం, లంకా దహనం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు అత్యుత్సాహంతో అర్థరాత్రి నుంచి తెల్లవారు ఝామువరకు వేచిఉంటారు. శనివారం అర్థరాత్రి జర్గే రథోత్సవంలో 50 అడుగులు ఎత్తు గల రథాన్ని వందలాది భక్తులు తాళ్ళతో లాగుతూ బసవన్న కట్ట వరకు తీసుకువెళ్ళి మరలా యధాస్థానానికి చేరుస్తారు. ఆదివారం అర్థరాత్రి జర్గే లంకాదహన కార్యక్రమంలో రకరకాల ఆకారాలు, డిజైన్లు ఉన్న బాణాసంచా కాలుస్తారు. ఇది చూడముచ్చటగా ఉంటుంది. కర్ణాటక రాష్ట్రం లోని బీదర్ జిల్లాకు చెందిన భావిగి అనే గ్రామలో సుమారు 200 సంవత్సరాల క్రితం భద్రప్ప జన్మించినట్లు భక్తుల నమ్మకం. ఈయన వీరభద్రుని అవతారమని చెబుతారు. భద్రప్ప నిజసమాధి ఉన్న భావిగిలో కూడ ఉత్సవాలు జర్గుతాయి.

(ఇంకా…)