వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 22వ వారం

సురేఖ

సురేఖ అని చూడగానే/వినగానే మహిళ అనిపించే పేరుతో 1958 నుండి వ్యంగ్య చిత్రాలు గీస్తున్న ఇతని అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు. "సురేఖ" అన్నపేరు పెట్టుకోవటానికి వెనుక కథ, ఇతనికి మంచి గీతల మీద ఉన్న మమకారం, అప్పటికే పేరు తెచ్చుకున్న బాపు మీద గౌరవం. బాపుకు ఉన్న మరొక కలం పేరు రేఖ. ఆ రేఖను తీసుకుని ఆ పదానికి "సు" తగిలించి, సు + రేఖ = సురేఖగా సంధించి పాఠకుల మీదకు తన వ్యంగ్య చిత్రాలను వదలటం మొదలు పెట్టాడు. సురేఖ అంటే మంచి గీత లేదా శుభ్రమైన గీత అని అర్ధం. తన "కుంచె" పేరును సార్థకం చేసుకుంటూ, మరొక పక్క ఒక పెద్ద బ్యాంకులో బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ తనవంతు సాహిత్య సేవ దశాబ్దాలపాటు కొనసాగించాడు. పదవీ విరమణ తరువాత తనకున్న అనేక అభిరుచులతో పాటు వ్యంగ్య చిత్ర రచనను కూడా కొనసాగిస్తున్నాడు. ఇతను ఒంగోలు పట్టణంలో 1941 మే 28 న జన్మించాడు. ఇతని తల్లితండ్రులు మట్టెగుంట వెంకట సుబ్బారావు, మట్టెగుంట సీతాలక్ష్మి. చదువు బి ఏ వరకు జరిగింది. ఆ తరువాత భారతీయ స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేశాడు. బాపు అంటే ఉన్న అభిమానం కార్టూనింగ్ నేర్చుకోవటానికి కారణమైంది. బొమ్మలు గీస్తూ, వాటికి మంచి సంభాషణలను అతికిస్తూ ఉండేవాడు. 1958 లో పదిహేడు సంవత్సరాల వయస్సులో ఇతని మొట్టమొదటి వ్యంగ్య చిత్రం ప్రచురితమయ్యింది.


(ఇంకా…)