వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 24వ వారం

అగస్త్య మహర్షి

అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప ఋషి. దక్షిణ భారతదేశంలో నేటికీ ఈ ఋషి జీవించే ఉన్నట్టుగా చెప్తారు. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు. భారతీయ సంప్రదాయం ప్రకారం అగస్త్యుడు చాలా భారతీయ భాషల్లో గొప్ప పండితుడు. ఋగ్వేదంలో 1.165వ శ్లోకం నుంచీ 1.191వ శ్లోకం వరకూ అగస్త్య మహర్షి, అతని భార్య లోపాముద్రలు రాసినవేనని పురాణ కథనం. ఋగ్వేదమే కాక, ఇతర వైదిక సాహిత్యం కూడా వారు రాశారు. అగస్త్యుడు ఎన్నో ఇతిహాసాలు, పురాణాలలో కనిపిస్తాడు. ముఖ్యంగా రామాయణ, మహాభారతాలలో అతని ప్రస్తావన ఉంది. అగస్త్యుడు సప్తర్షులలో ఒకడు. తమిళ శైవ సాహిత్యంలో అగస్త్యుని శైవ సిద్ధునిగా వర్ణించారు. శాక్తేయం, వైష్ణవాలకు చెందిన పురాణాలలోనూ అగస్త్యుని ప్రస్తావన వస్తుంది. దక్షిణ ఆసియాలోని దేవాలయాలలో దొరికిన పురాతన శిల్పాలలో అగస్త్యుని విగ్రహం కూడా ఉండడం విశేషం. ఆగ్నేయ ఆసియాలో ఉన్న, ఇండోనేషియాలోని జావా దీవిలో ఉన్న శివాలయంలో ఈ విగ్రహం లభ్యమైంది. పురాతన జావనీస్ గ్రంథం అగస్త్యపర్వ అనేది అగస్త్యుని గురించి రాసిన పుస్తకమే. ఈ పుస్తకంలో అగస్త్యుని గొప్ప మహర్షిగా, గురువుగా వర్ణిస్తూ రాశారు. ఈ పుస్తకం యొక్క 11వ శతాబ్దపు ముద్రణ ఇప్పటికీ లభ్యమవుతోంది. వరాహ పురాణంలోని అగస్త్య గీత, ద్వైద నిర్యాణ తంత్రం, స్కంద పురాణంలోని అగస్త్య సంహితలను రచించాడు అగస్త్యుడు. అగస్త్యుణ్ణి మన, కలశజ, కుంభజ, కుంభయోని, మైత్రావరుణి అని కూడా అంటారు.


(ఇంకా…)