వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 30వ వారం

శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం

శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో ఉంది. ఇది శ్రీకాకుళం నుండి 46 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి. ఈ గ్రామం మామిడి తోటలు, శోభాయమానంగా అగుపించే కొబ్బరి తోటలకు ఆలవాలం. దేవాలయ పరిసరాలలో ఉన్నంతసేపూ భగవంతునిపై భక్తిప్రవత్తులతోపాటు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానిగా ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో ఉంది. "శ్రీముఖలింగం" పేరులోనే చక్కని అర్ధం ఉంది. "శ్రీముఖలింగం" అనే పదానికి "పరమేశ్వరుడు లింగంలో కనిపించుట" అని అర్ధం. ఈ దేవాలయం లోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్టు ఉంటుంది. శ్రీముఖలింగేశ్వరంలో మూడు చోట్ల ముక్కోణపు ఆకారంలో మూడు ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన ఆలయం మధుకేశ్వర ఆలయం. ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వారు మధుకేశ్వర ఆలయం చుట్టూ సుందరమైన క్యూ కాంప్లెక్స్, పచ్చని మొక్కలతో సుందరమైన పార్కు ఏర్పాటు చేసారు.

(ఇంకా…)