వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 32వ వారం

తుర్లపాటి కుటుంబరావు

తుర్లపాటి కుటుంబరావు ప్రముఖ పాత్రికేయుడు, రచయిత మరియు వక్త. చిన్నప్పడే నార్ల వేంకటేశ్వరరావు గారి సంపాదకీయాలకు ప్రభావితుడై పత్రికారచన ప్రారంభించాడు. 2002 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో పాటు మరెన్నో పురస్కారాలు పొందాడు. తన 60ఏళ్ల పైబడిన పాత్రికేయవృత్తిలో 30, 40, 50, 60 వార్షికోత్సవాలను ప్రముఖుల చేతులమీదుగా జరుపుకొన్న వ్యక్తి. 1993 నాటికి పదివేలకు పైబడి బహిరంగసభలకు అధ్యక్షోపన్యాసాలు చేసి మంచి వక్తగా పేరుతెచ్చుకున్నాడు. అర్ధశతాబ్ది కాలంలో ఏ పదవి లేకుండా కేవలం ఉపన్యాసకుడుగా సభలకు అధ్యక్షునిగా వ్యవహరించిన వ్యక్తి తుర్లపాటి కుటుంబరావే నని గిన్నిస్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు పేర్కొన్నాడు. జూన్ 21, 2010 న ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాడు. తుర్లపాటి కుటుంబరావు ఐదుగురు సహోదరులలో మధ్యముడు. తనకు అక్క, అన్న మరియు తమ్ముడు, చెల్లి ఉండడంతో ప్రతి విషయంలో ఆలోచనలు మధ్యమ మార్గంగా ఉండేవని అన్నాడు. తండ్రి న్యాయవాది కనుక న్యాయవాది కావాలని కోరిక ఉన్నా చివరికి పాత్రికేయుడిగా మారాడు. ఆంధ్రప్రభలో నార్ల వెంకటేశ్వరరావు గారి సంపాదకీయాల ప్రభావంతో తుర్లపాటి పత్రికారచన ప్రారంభించాడు. తుర్లపాటి కుటుంబరావు పత్రికా రచన 1947 మార్చి నెలలో కేవలం 14 సంవత్సరాలవయస్సులో "స్వరాజ్యంలో స్వరాష్ట్రం" అనే శీర్షికతో మద్రాసు నుండి వెలువడే మాతృభూమి రాజకీయ వారపత్రికతో ప్రారంభమైంది.


(ఇంకా…)