వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 45వ వారం

ఆయిల్‌ పామ్

ఆయిల్‌ పామ్ పామే కుటుంబానికి చెందిన మొక్క. ప్రస్తుతం వాడకంలోనున్న వంటనూనెల్లో, మిగతా నూనెలకన్న తక్కువ ధరలో, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి జనానికి అందుబాటులో వున్న వంటనూనె పామాయిల్. పామాయిల్‌ను ఆఫ్రికాలో 5 వేల సంవత్సరాల క్రితం నుండే వాడుతున్నట్లు తెలుస్తున్నది. అక్కడి స్థానికులు పామాయిల్‌ పళ్లను వేడి నీళ్లలో బాగా మరగించి, రోకళ్ళ వంటి వాటితో నలగ్గొట్టి, గుజ్జును పిండి, నూనెను వడగట్టి తీసి వాడేవాళ్ళు. ఆయిల్‌పాంకు జన్మస్థానం దక్షిణాప్రికా లోని గునియాలోని వర్షాయుత, ఉష్ణమండల అరణ్యాలు. 14-17 శతాబ్ది మధ్యకాలంలో అమెరికా ఖండానికి, అక్కడినుండి తూర్పుదేశాలకు వ్యాప్తి చెందినదని కొందరి వాదన. 1910 లో స్కాట్మెన్‌ విలియం సిమో అనే ఇంగ్లీష్‌ బ్యాంకరు మలేషియాకు తీసుకెళ్ళాడనీ, అక్కడినుండి ఇండోనేసియా, పశ్చిమ ఆసియా, మరియు దక్షిణ అమెరికాకు వ్యాపించిందని మరి కొందరి వివరణ. కానీ 1870 నాటికే మలేసియా తదితర దేశాలలో పామాయిల్ తోటల పెంపకం మొదలైనదని మరి కొందరి అంచనా. మలేసియా మరియు ఇండోనేసియాలలో పామాయిల్‌ తోటల పెంపకం వలన ఆ దేశాల ఆర్థిక పరిస్థితి ఊహ కందనంతగా అభివృద్ది చెందింది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న పామాయిల్‌లో సగం శాతం ఈదేశాల నుంచే ఉత్పత్తి అవుతున్నది. అభివృద్ధి చెందితున్న దేశాలన్ని ఈ రెండు దేశాల నుండియే అధికశాతం పామాయిల్‌ను తమ దేశాలకు దిగుమతి చేసుకుంటున్నాయి.

(ఇంకా…)