వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 50వ వారం

ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ కుమార్ ముఖర్జీ భారతదేశ రాజకీయనాయకుడు. అతను భారతదేశానికి 2012 నుండి 2017 వరకు 13వ రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించాడు. తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంతో అతను భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా ఉన్నాడు. భారతదేశ కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రిత్వ పదవులను నిర్వహించాడు. రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు అతను కేంద్ర ఆర్థిక మంత్రిగా 2009 నుండి 2012 వరకు తన సేవలనందించాడు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆయనకెవరూ సాటి రారని రాజకీయ పక్షాలు అంటుంటాయి. 1969లో జరిగిన కాంగ్రెస్ సభలో అతను బంగ్లా కాంగ్రెస్ ప్రతినిధిగా ప్రసంగించాడు. ఆ ప్రసంగం విన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముగ్ధురాలైపోయింది. అతని తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడని, కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాల్లో పనిచేశాడని తెలుసుకున్న ఆమె ఒక ఏడాది ముగిసే లోపే అతనికి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడయ్యే అవకాశం కల్పించింది. ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తులలో ఒకడైనందున అతను 1973 లో కేంద్ర ప్రభుత్వంలోస్థానం పొందాడు. 1976 -77 లో వివాదస్పదమైన అంతర్గత అత్యవసర పరిస్థితులలో అతను కాంగ్రెస్ పార్టీలో ఇతర నాయకుల వలెనే నిందితునిగా ఉన్నాడు. అనేక మంత్రివర్గ సామర్థ్యాలలో ముఖర్జీ సేవలు తన మొట్టమొదటి దశలో ముగిశాయి. 1982-84 లో ఆర్థిక మంత్రిగాను, 1980-85 లో రాజ్యసభ నాయకునిగాను ఉన్నాడు.


(ఇంకా…)