వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 04వ వారం

కొండారెడ్డి బురుజు

కర్నూలు పేరు చెప్పగానే మనందరి ముందు తళుక్కున మెరిసేది కొండారెడ్డి బురుజు. ఇది కర్నూలు నగరానికి నడిబొడ్డులో ఉండి అందరినీ ఆకర్షిస్తుంది. ఈ బురుజుపైకెక్కి చూస్తే నగరమంతా అత్యంత సుందరంగా కనువిందు చేస్తుంది. కందనవోలు కోటకు నాలుగువైపుల ఉన్న బురుజులలో కొండారెడ్డి బురుజు ఒకటి. మిగతా మూడు శిధిలమైపోయినా నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నది ఈ కొండారెడ్డిబురుజు. శిధిలమైన ఆ మూడు బురుజులలో ఒకటి విక్టరీ టాకీస్ ప్రక్కన ఉంది. దీనిని "ఎర్ర బురుజు" అంటారు. ఎర్రని ఇసుకరాయితో నిర్మిచడం వలన దానికి ఆపేరు వచ్చింది. అందులో చిన్న ఎల్లమ్మ, పెద్ద ఎల్లమ్మ దేవాలయాలు ఉన్నాయి. ఎర్రబురుజు గోడల రాళ్లపై అనేక చిన్న చిన్న బొమ్మలను మనం గమనించవచ్చు. మిగిలిన రెండు బురుజులు తుంగభద్రానదిని ఆనుకొని ఉన్నాయి. ఒకటి కుమ్మరి వీధి దాటాక, మరొకటి సాయిబాబా గుడి ముందున్న బంగ్లా ప్రక్కన ఉన్నాయి. నదిని దాటి శత్రువులెవ్వరూ కర్నూలు నగరంలోనికి రాకుండా సైనికులు ఎప్పుడూ పహరా కాస్తుండేవారు. 1930లో భారతి పత్రికలో కర్నూలులోని ఒక బురుజు చిత్రాన్ని ప్రచురిస్తూ దాని క్రింద "రామానాయుడు బురుజు" అని రాసారు. మనం కుమ్మరి వీధి ప్రక్కన ఉన్న బురుజుకు పూర్వం ఆ పేరు ఉందని దీని ద్వారా తెలుసుకోవచ్చు. కొండారెడ్డి బురుజు చరిత్ర గూర్చి ఎటువంటి శాసనాలు లభ్యమవలేదు.

(ఇంకా…)