వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 12వ వారం

బోయకొట్టములు పండ్రెండు

బోయకొట్టములు పండ్రెండు అనే గ్రంథం కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె వ్రాసిన చారిత్రక నవల. 9వ శతాబ్ది నాటి తొలి తెలుగు పద్యశాసనమైన "పండరంగని అద్దంకి శాసనము" ను ఆధారం చేసుకుని దీనిని వ్రాశాడు. ఆ శాసనం తెలుగు పద్యసాహిత్య రచన 9వ శతాబ్ది నాటికే ఉన్నట్టు స్పష్టపరిచేందుకు ఒక ఆధారం. "పండరంగడు అనే చాళుక్య సేనాని పండ్రెండు బోయకొట్టముల మీద దాడి చేసి స్వాధీనంచేసుకొని, బోయరాజ్యపు ప్రధాన కొట్టము, కట్టెపు దుర్గాన్ని నేలమట్టం చేసి, కందుకూరును బెజవాడవలె ప్రధాన పట్టణముగా బలిష్టము గావించెను. ఆదిత్య బటరునికి కొంతభూమి దానమిచ్చెను. నెల్లూరును పరశురామప్రీతి గావించెను." అన్నది పండరంగని అద్దంకి శాసనానికి సరళమైన నేటి తెలుగులో అనువాదం. పన్నెండు బోయకొట్టాలను పండరంగడనే సైన్యవీరుడు ఓడించాడని ఇది తెలుపుతోంది. దీన్ని ఆధారం చేసుకుని రచయిత రెండువందల యేళ్ళ ఆంధ్ర రాజ్యాల చరిత్ర పునఃసృజించి చారిత్రక నవలారచన చేశాడు. నవల తెలుగు సాహిత్యరంగంలో అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. సాహిత్యవేత్తలైన "రాళ్ళబండి కవితా ప్రసాద్", "అంపశయ్య నవీన్" వంటి వారు ప్రశంసించారు.

(ఇంకా…)