వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 19వ వారం

పాండురంగ వామన్ కాణే
ఆచార్య పాండురంగ వామన్ కాణే (1880-1972) మహారాష్ట్రకు చెందిన ప్రముఖ భారతీయ చరిత్రకారుడు, సంస్కృత పండితుడు మరియు ఉపాధ్యాయుడు. 1963 లో ఈయన భారతరత్న పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈయనకు మహామహోపాధ్యాయ అనే బిరుదు ఉంది. ఈయన రచించిన ప్రఖ్యాత గ్రంథం "హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర". శతాబ్దాలుగా వెలువడిన పలు తాళపత్రగ్రంథాల మొదలు పుస్తకాల వరకు పరిశోధించిన డా. కాణే ఈ పుస్తకము ద్వారా భారతదేశముయందలి ప్రాచీన, మధ్య తరాలలో న్యాయవర్తనయొక్క పరిణామక్రమము గురించి తెలియజేసెను. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బాంబే, భండార్కర్ ఓరియంటల్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రఖ్యాత సంస్థలలో లభ్యమయిన వనరులను డా. కాణే తన పరిశోధనలో ఉపయోగించారు. ఆరువేల అయిదువందల పుటల పైబడి ఉన్న ఈ గ్రంథము ఐదు సంపుట్లలో ప్రచురితమయ్యింది; మొదటి సంపుటి 1930లో ప్రచురింపబడగా చివరి సంపుటి 1962లో ప్రచురింపబడింది. ఈ గ్రంథము విషయవైశాల్యము, లోతైన పరిశోధనలకు పేరు పొందినది - డా. కాణే మహాభారతం, పురాణాలు, చాణక్యుడు వంటి విభిన్న దృక్పథాల రచనలను సంప్రదించడమే కాక, అప్పటివరకు జనసామాన్యానికి తెలియని ఎన్నో పుస్తకాలను సంప్రదించారు. ఈ గ్రంథ వైశిష్ట్యము ఆయన సంస్కృత భాషా ప్రావీణ్యానికి ఆపాదించబడింది. పురాణాలు మున్నగు గ్రంథాలను పూజాభావముతో కాక అపేక్షాభావముతో పరిశోధించినందువలనే ఆయన కృతార్థులయ్యారని ఒక భావన.
(ఇంకా…)