వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 29వ వారం

సౌందర్య
సౌందర్య భారతీయ సినిమా నటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం మరియు మలయాళం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది. 12 సంవత్సరాలు నటిగా వెలిగిన ఈమె బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది. సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటపుడే మొదటి చిత్రంలో నటించింది. ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి యొక్క స్నేహితుడు, గంధర్వ (1992) చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అమ్మోరు చిత్రం విజయవంతమైన తరువాత, ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది. తరువాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయఢంకా మ్రోగించింది. ఆమె కన్నడ, తమిళం, మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ చిత్రంలో కూడా నటించింది. హిందీలో ఆమె అమితాబ్ బచ్చన్ తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ చిత్రంలో నటించింది. సౌందర్య గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు పలు పురస్కారాలు అందుకుంది. ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ ఛాయాచిత్రగ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శింపబడింది.
(ఇంకా…)