వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 32వ వారం

హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు

1945 లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో, అమెరికా, జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై రెండు అణుబాంబు దాడులు చేసింది. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జరిగిన ఈ దాడుల్లో కనీసం 1,29,000 మంది మరణించారు. మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగినది ఈ రెండు సంఘటనల్లో మాత్రమే. ఈ దాడులు చేసే ముందు అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మద్దతు తీసుకుంది. యుద్ధం చివరి ఏడాదిలో మిత్రరాజ్యాలు జపానును ఆక్రమించుకునేందుకు సిద్ధపడ్డాయి. దీనికి ముందు అమెరికా సాంప్రదాయిక బాంబుదాడులు చేసి 67 జపాన్ నగరాలను ధ్వంసం చేసింది. 1945 మే 8 న, హిట్లరు ఆత్మహత్య చేసుకున్న కొద్దిరోజులకు, జర్మనీ లొంగుబాటు ఒప్పందంపై సంతకం చెయ్యడంతో ఐరోపాలో యుద్ధం ముగిసింది. ఓటమి తప్పని స్థితిలో ఉన్న జపాను బేషరతు లొంగుబాటుకు ఒప్పుకోకపోవడంతో పసిఫిక్ యుద్ధం కొనసాగింది. జపాను బేషరతుగా లొంగిపోవాలని 1945 జూలై 26 న మిత్ర రాజ్యాలు తమ పోట్స్‌డామ్ డిక్లరేషనులో ప్రకటించాయి. లేదంటే పెనువినాశనమేనని కూడా డిక్లరేషను హెచ్చరించింది. జపాను దాన్ని పెడచెవిని పెట్టింది. 1945 ఆగస్టు నాటికి మన్‌హట్టన్ ప్రాజెక్టు రెండు రకాల అణుబాంబులు తయారు చేసింది. మారియానా ద్వీపాల్లోని టినియన్ నుండి ఈ బాంబులను మోసుకెళ్ళేందుకు అమెరికా వైమానిక దళం బోయింగ్ B-29 సూపర్‌ఫోర్ట్రెస్‌ను సమకూర్చుకుంది.

(ఇంకా…)