వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 33వ వారం

రేలంగి వెంకట్రామయ్య

రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య పద్మ శ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. అతను తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి హరికథ, సంగీతం నేర్పించేవాడు. రేలంగి చిన్నతనం నుండి తన తండ్రి దగ్గర సంగీతం, హరికథలు నేర్చుకుంటూ పాటలు, పద్యాలు పాడడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని బాల్యమంతా ఎక్కువ భాగం రావులపాడు, కాకినాడల్లో గడిచింది. చదువుకునే వయసునుంచే నాటకాలు వేయడం ప్రారంభించాడు. రేలంగిని సినీ పరిశ్రమకు పరిచయం చేసింది దర్శకుడు సి.పుల్లయ్య. 1935లోనే సినిమాల్లోకి ప్రవేశించినా 1948 దాకా చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ఈ సమయంలో పుల్లయ్య దగ్గర సినీ నిర్మాణానికి సంబంధించి పలు శాఖల్లో పని చేశాడు. 1948లో వచ్చిన వింధ్యరాణి సినిమాతో ఆయన కెరీర్ విజయాల బాట పట్టింది. తర్వాత వచ్చిన కీలుగుర్రం, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, మిస్సమ్మ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 300కి పైగా చిత్రాల్లో నటించాడు. నటుడిగా తారా స్థాయినందుకున్న రేలంగి పలు సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేసింది. రేలంగి నటుడిగా తారా స్థాయికి చేరగానే ఆయనకు సన్మానాలు, బిరుదులు, కనకాభిషేకాలు, గజారోహణలు మొదలైనవెన్నో జరిగాయి.

(ఇంకా…)