వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 36వ వారం

జమలాపురం కేశవరావు

సర్దార్ జమలాపురం కేశవరావు (సెప్టెంబరు 3, 1908 - మార్చి 29, 1953), నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు . ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ తొలి అధ్యక్షుడు. ప్రజల మనిషిగా, ప్రజల కోసం జీవిస్తూ, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఆయన ప్రవృత్తిగా జీవించాడు. అందుకే ఆయన్ను అందరూ తెలంగాణ ‘సర్దార్’ గా పిలుచుకుంటారు. దక్కన్‌ సర్దార్‌గా, ఉక్కు మనిషిగా ప్రజలు పిలుచుకునే కేశవరావు నిజాం సంస్థానంలో తూర్పు భాగాన ఉన్న ఖమ్మం (నాటి వరంగల్ జిల్లా)లోని ఎర్రుపాలెంలో 1908 సెప్టెంబర్ 3 న జమలాపురం వెంకటరామారావు, వెంకటనరసమ్మలకు తొలి సంతానంగా జన్మించాడు. సంపన్న జమీందారీ వంశంలో పుట్టినా, నాటి దేశ రాజకీయాలు అతనిని ఎంతగానో కలవరపరచాయి. ఎర్రుపాలెం లో ప్రాథమిక విద్య అనంతరం, హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించాడు. వందేమాతరం గీతాలాపనను నిషేధించినందుకు నిరసనగా, కళాశాల విద్యార్థులను కూడగట్టి, నిరసనోద్యమంలోకి దిగారు. గీతాన్ని ఆలాపించనివ్వకపోతే తరగతులకు హాజరుకాబోమని హెచ్చరించారు. దీంతో చివరకు నిజాం పాలకవర్గం నిషేధాన్ని ఎత్తివేయక తప్పలేదు. ఈఘటన తర్వాత కేశవరావు ఆలోచనా పరిధిని మరింత విస్తృతం చేసి ఆయన వెళ్లాల్సిన మార్గాన్ని మరింత స్పష్టం చేసింది.

(ఇంకా…)