వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 40వ వారం

లె కార్బుజియె
లె కార్బూజియె గా ప్రసిద్ధి చెందిన ఛార్లెస్ ఎడ్వర్డ్ జెనరెట్ స్విట్జర్లాండ్‌లో జన్మించిన ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్, డిజైనర్, అర్బన్ ప్లానర్, పెయింటర్, రచయిత. ఇతడు స్విట్జర్లాండ్‌లో జన్మించి 1930లో ఫ్రెంచి పౌరసత్వం స్వీకరించాడు. ఇతడు 5 దశాబ్దాలపాటు యూరప్, జపాన్, అమెరికా మరియు భారత దేశాలలో పలు భవంతులకు డిజైన్ చేశాడు. జనసమ్మర్దమైన నగరాలలో ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరచడానికి ఇతడు అర్బన్ ప్లానింగ్ రంగంలో అంకిత దృష్టితో పనిచేశాడు. ఇతడు ఇంటర్నేషనల్ మాడ్రన్ ఆర్కిటెక్చర్ కాంగ్రెస్ లో వ్యవస్థాపక సభ్యుడు. ఇతడు చండీగఢ్ నగరం మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ నగరంలోని పలు భవంతులకు ఇతడు డిజైన్ చేశాడు. 2016, జూలై 17న యునెస్కో ప్రకటించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో 17 ఇతడు చేపట్టిన ప్రాజెక్టులు కావడం మాడ్రన్ ఆర్కిటెక్చర్‌లో ఇతని కృషికి ఒక తార్కాణంగా పేర్కొనవచ్చు. ఇతడు తన 15వ యేట విజువల్ ఆర్ట్స్ పట్ల ఆకర్షితుడైనాడు. ఇతడు లా షాక్స్ డి ఫాండ్స్ గ్రామంలోని మునిసిపల్ ఆర్ట్ స్కూలులో చేరి గడియారాల తయారీకి సంబంధించిన అప్లైడ్ ఆర్ట్ నేర్చుకున్నాడు. మూడు సంవత్సరాల పిమ్మట ఛార్లెస్ అనే పెయింటర్ వద్ద అలంకరణలో ఉన్నత శిక్షణను తీసుకున్నాడు.
(ఇంకా…)