వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 51వ వారం

మేడపాటి వెంకటరెడ్డి

మేడపాటి వెంకటరెడ్డి యోగవిద్య లో నిష్ణాతులు. సికింద్రాబాదులోని ప్రభుత్వ వేమన యోగ పరిశోధనా సంస్థకు డైరెక్టర్‌గా, ఆరోగ్య వైద్యశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ యోగాధ్యయన పరిషత్తుకు కార్యదర్శిగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ గవర్నరు గారికి యోగచికిత్సా నిపుణుడిగా సేవలను అందిస్తున్నారు. మేడపాటి వెంకట రెడ్డి తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం సమీపంలోని అర్తమూరు గ్రామంలో 18 డిసెంబరు 1947న జన్మించారు. ఈ గ్రామం వైష్ణవ మత ప్రభోధకుడు పరమహంస పరివ్రాజకులు అయిన త్రిదండి చిన్ నజీయర్ స్వామి జన్మించిన ఊరు. ఇతడు రాజకీయ నేపధ్యంలో కూడిన మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో మేడపాటి సుబ్బిరెడ్డి, వీరయమ్మ దంపతులకు గల ముగ్గురు మగ పిల్లలలో ఆఖరి సంతానంగా జన్మించారు. 5వ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనూ, ఎస్.ఎస్.ఎల్.సి వరకు మండపేటలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో బి.ఎ పట్టాను, విశాఖపట్నం నందలి ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో ఎం.ఎ (అంతర్జాతీయ న్యాయశాస్త్రం) పట్టాను పొందారు. రాజమండ్రిలో ఉండగా హిందీ వ్యతిరేక ఉద్యమంలోనూ మరియు ఉక్కు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని రాష్ట్రంలో విద్యార్థి నాయకునిగా గుర్తింపు పొందారు. అతను పురాతత్వ, శాసన, సాహిత్య, సంప్రదాయాలను సమన్వయ పర్చి తరతరాల ఆంధ్రుల ఇంటిపేర్లను క్రీస్తు పూర్వం నుండి నేటి వరకు చరిత్రను జాతికి కానుకగా అందిచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

(ఇంకా…)