వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 05వ వారం

మానవ పరిణామం
మానవ పరిణామం అనేది శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల ఆవిర్భావానికి దారితీసిన పరిణామ ప్రక్రియ. ఇది ప్రైమేట్స్ పరిణామ చరిత్రతో, ప్రత్యేకించి హోమో జాతి పరిణామ చరిత్రతో మొదలై, హోమినిడ్ కుటుంబం లోనే గొప్ప జాతిగా హోమో సేపియన్స్ జాతి ఆవిర్భవించడానికి దారితీసింది. రెండు కాళ్ళపై నడక, భాష వంటి లక్షణాల అభివృద్ధి ఈ ప్రక్రియలో భాగం వీటితో పాటు, ఇతర హోమినిన్లతో జాత్యంతర సంతానోత్పత్తి వంటివి కూడా ఈ పరిణామ ప్రక్రియలో భాగమవడాన్ని బట్టి, మానవ పరిణామం సూటిగా ఒక సరళరేఖలో సాగినది కాదని, అదొక సాలె గూడు లాగా విస్తరించిందనీ తెలుస్తోంది. మానవ పరిణామాన్ని అధ్యయనం చెయ్యడంలో ఫిజికల్ ఆంత్రోపాలజీ, ప్రైమటాలజీ, ఆర్కియాలజీ, పాలియోంటాలజీ, న్యూరోబయాలజీ, ఎథాలజీ, భాషాశాస్త్రం, ఎవల్యూషనరీ సైకాలజీ, పిండశాస్త్రం, జన్యుశాస్త్రం వంటి అనేక శాస్త్రాలు భాగం పంచుకున్నాయి. 8.5 కోట్ల సంవత్సరాల క్రితం, చివరి క్రెటేషియస్ పీరియడ్‌లో ప్రైమేట్స్, ఇతర క్షీరదాల నుండి వేరుపడ్డాయని జన్యు అధ్యయనాలు చూపుతున్నాయి. తొట్టతొలి శిలాజాలు మాత్రం 5.5 కోట్ల సంవత్సరాల క్రితం, పాలియోసీన్‌లో కనిపిస్తాయి.
(ఇంకా…)