వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 25వ వారం
నక్షత్రము |
---|
నక్షత్రాలు చీకటి రాత్రి, జనావాసాలకి దూరంగా, మబ్బులు లేని ఆకాశంలోకి తలెత్తి చూస్తే ముఖ్మల్ గుడ్డ మీద వెదజల్లిన వజ్రాలలా, మిలమిల మెరుస్తూ ఆకాశం నిండా కనిపిస్తాయి. నగ్న నయనాలకి సుమారు 4,000 నక్షత్రాలు కనిపించవచ్చు. దుర్భిణితో చూస్తే వేలకి వేలు, లెక్కపెట్టడానికి వీలులేనన్ని, కనిపిస్తాయి. నిజానికి మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. మిగిలిన నక్షత్రాలతో పోల్చి చూసినప్పుడు సూర్యుడు అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం కాబట్టి కైవారంలో పెద్ద బింబంలా కనిపిస్తాడు, అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. మనం ఆకాశం వైపు చూసినప్పుడు మనకి కనబడే నక్షత్రాలన్నీ చెల్లాచెదురుగా, యాదృచ్ఛికంగా, వెదజల్లినట్లు కాకుండా, గుంపులు గుంపులుగా, గుర్తుపట్టడానికి వీలయిన ఆకారాలు ఉన్నట్లు, కనిపిస్తాయి. ఇలాంటి గుంపులకి మన పూర్వులు పెట్టిన పేర్లు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి: ఒరాయన్ లేదా మృగవ్యాధుడు, సప్త మహర్షిలు, వగైరా. మరికొన్ని నక్షత్రాల గుంపులకి మనందరికీ పరిచయమైన పేర్లు ఉన్నాయి: మేషం, వృషభం, మిధునం, కర్కాటకం,..., మీనం. ఈ పన్నెండు నక్షత్రాల గుంపుల ప్రత్యేకత ఏమిటంటే - భూమి సూర్యుడి చుట్టూ తిరిగే ఏడాదిలో, భూమి నుండి ఆకాశం లోకి సూర్యుడి వైపు చూస్తూన్నప్పుడు, ఒకొక్క నెలలో ఒకొక్క గుంపు (లేదా రాసి) సూర్యుడి వెనుకనున్న నేపథ్యంలో ఉంటుంది. (ఇంకా…) |