వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 33వ వారం

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్ర స్థాయి గ్రంథాలయ సంఘం. దీన్ని 1914 ఏప్రిల్ 10 న విజయవాడలో స్థాపించారు. ప్రజలలో అక్షరాస్యత, జ్ఞానం, అవగాహనలను వ్యాప్తి చేయాలనే గొప్ప లక్ష్యంతో ఈ సంఘం ఉద్భవించింది. గ్రంథాలయోద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఏకైక లక్ష్యంతో ఈ సంఘం మొదట నుండి పనిచేస్తోంది. విజయవాడ (పూర్వపు బెజవాడ) లోని రామామోహన ప్రజా గ్రంథాలయం వారు "ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ లైబ్రరీ ఆర్గనైజర్స్" ను 1914 ఏప్రిల్ 10 న నిర్వహించారు. అదే రోజున నిర్వహించబడిన ఆంధ్ర గ్రంథాలయ సమావేశ ఫలితంగా ఆంధ్ర గ్రంథాలయోద్యమం ఇంకా ఆంధ్రప్రదేశ్ గ్రంథ భండాగార సంఘం (అసోసియేషన్ ఆఫ్ లైబ్రరీస్ ఆఫ్ ఆంధ్ర ఏరియా) ఉనికిలోకి వచ్చాయి. అయ్యంకి వెంకటరమణయ్య, సూరి వెంకట నరసింహ శాస్త్రి ఈ సంఘాన్ని ప్రారంభించారు. ఈ మహాసభలోనే, సంఘపు మొదటి అధ్యక్షుడిగా దీవాన్ బహదూర్ మోచర్ల రామచంద్రరావు పంతులు, మొదటి కార్యదర్శులుగా, అయ్యంకి వెంకటరమణయ్య, నాళం కృష్ణారావు ఎన్నికయ్యారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు దీనికి అధ్యక్షత వహించారు. ఆ సందర్భంగా ఆయన వెలువరించిన సందేశ గీతాన్ని అయ్యంకి వెంకటరమణయ్య 'గ్రంథాలయ వేదం'గా అభివర్ణించారు. పూర్తి అక్ష్యరాశ్యత సాధించడము కొరకు కృషి చేయుట, రాష్ట్రంలో ప్రతి మూలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయుట, ప్రజలకు ఉచితంగా సమాచారం అందించుట, ప్రజలలో చదివే అలవాటును పెంపొందించడం, గ్రంథాలయాలను ఆధునీకరించుట మొదలగునవి ఈ సంఘ లక్ష్యాలు
(ఇంకా…)