వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 47వ వారం

చుక్కా రామయ్య
చుక్కా రామయ్య తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, మాజీ శాసనమండలి సభ్యుడు. జనగామ జిల్లా, గూడూరు గ్రామంలో జన్మించిన ఇతను ఐఐటి శిక్షణా కేంద్రం స్థాపించడం కోసం హైదరాబాదుకు వచ్చాడు. ఐఐటీ శిక్షణలో మంచి పేరు సంపాదించి ఐఐటి రామయ్య అని పేరు తెచ్చుకున్నాడు. హైదరాబాదులోని నల్లకుంటలో ఈ శిక్షణా కేంద్రం ఉంది. ఇతను 1925, నవంబర్ 20 న జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రుల పేర్లు నరసమ్మ, అనంత రామయ్య. తండ్రి పౌరోహిత్యం చేసేవాడు. రామయ్యకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. రామయ్య పద్నాలుగేళ్ళ వయసులో ఉండగా తండ్రి మరణించాడు.రామయ్య తన స్వస్థలమైన గూడూరులో మూడవ తరగతి వరకూ చదివాడు. డిగ్రీ, ఎం.ఎస్.సి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేసాడు. హైదరాబాదు సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. అస్పృశ్యతా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు వాళ్ళ కుటుంబాన్ని మిగతా బ్రాహ్మణులు వెలివేశారు. జనగామ జిల్లా జనగాంలో ఉపాధ్యాయుడిగా చేరి తెలంగాణలోని అనేక పాఠశాలల్లో పనిచేసాడు. 1983 లో నాగార్జున సాగర్ లోని రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసాడు. ఉద్యోగంలో ఉండగా ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉండేవాడు.
(ఇంకా…)